ఇంటర్నెట్ డెస్క్: బౌలింగ్ వేసే క్రమంలో బంతి గింగిరాలు తిరగడం మీరు చూసి ఉంటారు. కానీ ఎప్పుడైనా బౌలర్ గింగిరాలు తిరుగుతూ వచ్చి బౌలింగ్ చేయడం చూశారా..? లేకపోతే ఇప్పుడు చూడండి. భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కొద్ది రోజుల క్రితం ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనికి కారణం.. ఆ వీడియోలో బౌలర్ బౌలింగ్ చేస్తున్న విధానమే. బంతిని తీసుకుని గింగిరాలు తిరుగుతూ వచ్చి బౌలింగ్ చేస్తుండడంమే దీనికి కారణం.

యువీ షేర్ చేసిన వీడియోలోని ఓ బౌలర్ యాక్షన్ ఇప్పటివరకు ఎన్నడూ చూడని విధంగా ఉంది. క్రికెట్‌లో మరెవరూ వేయని రీతిలో అతని బౌలింగ్ ఉండడంతో నెటిజన్లు షాక్ తింటున్నారు. డ్యాన్స్ మాదిరి ఉన్న ఆ బౌలింగ్ యాక్షన్‌కు తాను కూడా షాక్ తిన్నానని.. అందుకే ఈ వీడియోను షేర్ చేస్తున్నానని యూవీ చెప్పాడు. అంతేకాదు ఈ వీడియోను మాజీ స్పిన్నర్ హర్బజన్ సింగ్‌కు ట్యాగ్ చేశాడు. 'భరతనాట్యం స్టైల్ ఆఫ్ స్పిన్.. ఏమంటావ్ భజ్జీ' అనే క్యాప్షన్‌తో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ‘ఇన్నాళ్లూ ఎంతో మంది బౌలర్లను చూశాం.. లసిత్ మలింగా, జస్‌ప్రీత్ బుమ్రా, రషీద్ ఖాన్ ఇలా ఎంతోమంది విలక్షణమైన యాక్షన్‌తో బౌలింగ్ చేసేవారిని చూశాం. కానీ ఇంత విచిత్రంగా బౌలింగ్ చేసేవ్యక్తిని మాత్రం ఇప్పుడే చూస్తున్నాం’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఇలాంటి యాక్షన్‌తో అంతర్జాతీయ మ్యాచుల్లో బౌలింగ్ చేస్తే ఇక బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు కనపడడం ఖాయమని అంటున్నారు. అయితే కొందరు మాత్రం ఇలాంటి బౌలింగ్ యాక్షన్‌ను ఇంటర్నేషనల్ గేమ్స్‌లోకి అనుమతించకపోవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే యువరాజ్ సింగ్ ఒకప్పుడు భారత్ తరపున మేటి ఆటగాడిగా, సెన్సేషనల్ ఆల్‌రౌండర్‌గా పేరు సంపాదించాడు. ముఖ్యంగా 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్‌లలో యువీ కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లలో అద్భుత ప్రదర్శనతో కోట్ల మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు. యువీ తన కెరీర్లో చక్కటి లెఫ్టార్మ్ బౌలర్‌గా సక్సెస్ అయ్యాడు. వన్డేల్లో 111, టెస్ట్‌ల్లో 9, టీ20ల్లో 28 వికెట్ల చొప్పున అంతర్జాతీయంగా మొత్తం 148 వికెట్లు పడగొట్టాడు. ఇక 17 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌కు యూవీ 2019లో వీడ్కోలు పలికాడు.


 

మరింత సమాచారం తెలుసుకోండి: