బ్రిస్బేన్: ఒకపక్క భారీ ఉత్కంఠతో జరుగుతున్న మ్యాచ్.. మరో పక్క ఆసీస్ బ్యాట్స్‌మెన్ క్రీజులో పాతుకుపోయి ఆడుతున్నారు. మ్యాచ్ ఏ మాత్రం అటుఇటైనా ప్రతిష్ఠాత్మకమైన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రత్యర్థికి దక్కుతుంది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో అయితే చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనైంది. ఏదో బౌలర్ల చలవతో జట్టు మళ్లీ మ్యాచ్‌లో నిలిచింది. అయితే ఇంత ఒత్తిడిలోనూ టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ సరదాగా పాటలు పాడుకుంటూ తోటి ఆటగాళ్లతో జోకులు పేల్చుతున్నాడు.

 స్పైడర్ మ్యాన్.. స్పైడర్ మ్యాన్ అంటూ చిన్న పిల్లాడిలా పాడుకున్నాడు. అంతకంటే ముందు ‘ఇలా బూజు విసురు.. ఇలా..’ అంటూ స్పైడర్ మ్యాన్‌లా తోటి ఆటగాళ్లను ఆటపట్టించాడు. ఆ తర్వాత ఈ పాట అందుకున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బా వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో రిషబ్ పంత్‌ పాట పాడుతున్న ఆడియో స్టంప్ మైక్‌లో రికార్డయింది. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

వికెట్ల వెనుక కీపర్ చేసే ప్రతి చిన్న శబ్దం కూడా స్టంప్‌ మైక్‌ ద్వారా రికార్డు అవుతుంది. బ్యాట్స్‌మెన్‌ను స్లెడ్జింగ్ చేసినా, బౌలర్లకు సూచనలిచ్చినా.. ప్రతి ఒక్కటి ఈ మైక్ ద్వారా రికార్డవుతుంది. అయితే అలా రికార్డయిన ఆడియో, వీడియో క్లిప్పుల్లో కొన్ని వివాదాలు రేపితే మరికొన్ని మాత్రం ఫన్నీగా ఉంటూ విపరీతంగా వైరల్ అవుతాయి. ఇటీవల ఆసీస్ కెప్టెన్, కీపర్ టిమ్ పెయిన్.. భారత ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా ఈ మైక్ ద్వారానే బయటకొచ్చాయి. అయితే ఇప్పుడు ఇంత ఒత్తిడి పరిస్థితుత్లోనూ పంత్ పాడుతూ ఉండడాన్ని నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. మరో ధోనీ అంటూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

ఇదిలా ఉంటే వికెట్ల వెనక రిషబ్ ఎప్పుడూ సరదాగా ఉంటాడు. బౌలర్లను, ఫీల్డర్లను ఉత్సాహపరుస్తూ తాను కూడా అంతే ఉత్సాహంతో కీపింగ్ చేస్తుంటాడు. అప్పుడప్పుడు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌తో కూడా సరదా కామెంట్స్ చేస్తుంటాడు. అయితే ఈ సారి మాత్రం అతడు పాట పాడుతూ సరదాగా ఉండడంపై నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఒకపక్క మ్యాచ్ అంత ఉత్కంఠగా సాగుతుంటే పంత్‌కు పాటలెలా వస్తున్నాయి..? పంత్ కూడా ధోనీలా కూల్‌గా మారిపోతున్నాడేమో..! అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. మరో మరో ట్విటర్ యూజర్ ‘పంత్‌కు మ్యూజిక్‌పై ఉన్న ఇష్టాన్ని తానెంతగానో గౌరవిస్తానం’టూ కామెంట్ చేశాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: