బ్రిస్బేన్: టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అంపైర్ అవతారమెత్తాడు. వార్నర్ అవుటైనట్లు ప్రకటించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఈ వింత దృశ్యం కనపడింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో వార్నర్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగి విషయం తెలిసిందే. అయితే అంపైర్ అవుటిచ్చినప్పటికీ వార్నర్ రివ్యూ కోరాడు. ఈ రివ్యూలో కూడా థర్డ్ అంపైర్ వార్నర్‌ను అవుట్‌గా ప్రకటించాడు.

దీంతో ఆన్‌ఫీల్డ్ అంపైర్ వార్నర్‌ను అవుట్‌గా ప్రకటించాడు. అయితే అప్పుడే అటుగా వెళుతున్న రోహిత్ శర్మ అంపైర్‌కంటే ముందే చేయి ఎత్తి అవుటైనట్లు సంకేతమిచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రోహిత్ ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఎన్నో రకాల బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడని, ఓ బ్యాట్స్‌మెన్‌గా, బౌలర్‌గా, వికెట్ కీపర్‌గా, అంపైర్‌గా అన్ని బాధ్యతలూ రోహిత్ శర్మ మోస్తున్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

అంతేకాదు ఆసీస్ బ్యాటింగ్ సమయంలో క్రీజులోకి వెళ్లి మరీ బ్యాటింగ్ విధానాన్ని చెక్ చేశాడు. స్మిత్ ఎదుటే షాడో బ్యాటింగ్ మార్క్స్‌పై నిలబడి బ్యాటింగ్ చేస్తున్నట్లు చెకింగ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ... స్మిత్‌ను ఆటపట్టించడానికే రోహిత్ ఇలా చేసి ఉండచవచ్చని లేకపోతే నిజంగానే బ్యాటింగ్ గురించి చెక్ చేసుకుని ఉండవచ్చని అన్నాడు.

ఇదిలా ఉంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బాగంగా సిడ్నీలో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో పంత్ ఫుట్ మార్క్స్‌పై స్మిత్ నిలబడి ఇలానే షాడో బ్యాటింగ్ చేశాడు. అంతేకాకుండా పంగ్ ఫుట్ మార్క్స్‌ను కూడా తొలగించాడు. దీంతో నెట్టింట పెద్ద దుమారమే రేగింది. స్మిత్‌ను భారత క్రికెట్ అభిమానులు తీవ్రంగా విమర్శించారు. అయితే అది తన అలవాటని, ప్రతి మ్యాచ్‌లోనూ అలానే చేస్తానని, పంత్ ఫుట్ మార్క్స్‌ను తుడిచేయాలనే ఆలోచనే తనకు లేదని స్మిత్ ఆ తర్వాత వివరణ ఇవ్వడంతో వివాదం సర్దుమణిగింది.



మరింత సమాచారం తెలుసుకోండి: