బోర్డర్‌– గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత్ అద్భుత విజయం సాధించింది. నాలుగు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను భారత్‌ 2-1తో కైవసం చేసుకుని గబ్బా మైదానంలో కంగారూలను గడగడలాడించింది.. ఆస్ట్రేలియా జట్టును తమ గడ్డపైనే మట్టి కరిపించి క్రికెట్ ప్రపంచం మొత్తం ఒక్కసారిగా భారత్ వైపు చూసే విధంగా అపూర్వ విజయం సొంతం చేసుకుంది. టీమిండియా లో కీలక ఆటగాళ్లు అందరూ గాయాల బారిన పడుతూ జట్టుకు దూరం అవుతున్న సందర్భంలో కుర్రాళ్ళు ముందుండి నడిపించి భారత్ ఘన విజయాన్ని కట్టబెట్టారు.

ఈ టెస్ట్ సిరీస్ విజయంతో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్ లో భారత్ చాలా రోజుల తర్వాత అగ్రస్థానానికి చేరుకుంది. భారత్ 430 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా.. భారత్  తర్వాత న్యూజిలాండ్‌ (420), ఆస్ట్రేలియా(332) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. గబ్బా లో జరిగిన చివరి టెస్ట్ ఉత్కంఠ భరితంగా సాగుతూ ఇరు జట్లకు విజయం దోబూచులాడుతుంది. ఆతిథ్య జట్టు నిర్థేశించిన 328 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించే ఈ క్రమంలో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ మొదట్లోనే అవుట్ కావడంతో భారత్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

 ఆ తరవాత క్రీజ్‌లోకి వచ్చిన పుజారా, మరో ఓపెనర్‌ శుభమన్‌ గిల్‌తో ఇన్సింగ్స్‌కు బలమైన పునాదులు వేశారు. గిల్‌ 91 పరుగుల వద్ద ఔట్‌ అవ్వగా.. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. పుజారా సైతం బాధ్యతగా ఆడి 56 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. కెప్టెన్‌ రహానే 24 పరుగులతో వెంటనే పెవిలియన్‌ బాట పట్టినా.. ఇక ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన యువ సంచలనం రిషభ్‌ పంత్‌ ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. స్కోరుబోర్డును పరుగులు పెట్టేస్తూ అద్భుతమైన ఆటతీరుతో భారత్‌ను విజయ తీరాలకు చేర్చాడు. పంత్‌ 138 బంతుల్లో 89 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. రిషభ్‌ పంత్‌ దూకుడైన ఆటకు.. పుజారా డిఫెన్స్‌ తోడవడంతో ఆసీస్‌ గడ్డపై విజయాన్ని సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: