బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో  ఆతిథ్య ఆసీస్ కు గట్టి షాక్ ఇచ్చిన టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. బోర్డ‌ర్-గ‌వాస్క‌ర్ ట్రోఫీలో పాలు పంచుకున్న  భారత ఆట‌గాళ్ల‌కు బోన‌స్‌ ను ప్ర‌క‌టించింది.  భారత ఆటగాళ్ళకు రూ.5 కోట్ల టీమ్ బోన‌స్‌ ఇస్తున్నట్లు బీసీసీఐ అధ్య‌క్షుడు గంగూలీ తెలిపాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగో టెస్టులో టీమిండియా  మంగళవారం ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. ఈ విజయంలో నాలుగో టెస్టుల సిరీస్ ను 2-1 భారత్ కైవసం చేసుకుంది.

ఇక ఈ విజయం అనంతరం బీసీసీఐ అధ్య‌క్షుడు గంగూలీ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో ఈ విజ‌యం ఎన్న‌టికీ మ‌రిచిపోనిద‌ని పేర్కొన్నాడు. ఇదో అద్భుత విజ‌యం అని, ఆస్ట్రేలియాకు వెళ్లి అక్క‌డ టెస్ట్ సిరీస్‌ను గెల‌వ‌డం అపూర్వ‌మ‌ని ట్వీట్ చేసాడు.  ఈ విజయం విలువ‌కు ఏదీ స‌మానం కాద‌ని అన్నాడు.

కాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్ 36 పరుగులకే కుప్ప కూలిన భారత్ ఘోర పరాభవాన్ని మూట గట్టుకుంది. రెండో టెస్టుకు ముందు పితృత్వ సెలవుల కారణంగా కెప్టెన్ కోహ్లీతో పాటు సీనియర్ పేసర్ మహ్మద్ షమీ దూరం అవడంతో ఈ సిరీస్ ను ఆసీస్ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆ దేశ మాజీ ఆటగాళ్ళు ఎద్దేవా చేసారు. అయితే రెండో టెస్టులో కెప్టెన్ అజింక్య రహనే సెంచరీతో కదం తొక్కి సిరీస్ ను 1-1 సమం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మూడో టెస్ట్ లో ఓటమి అంచుల్లో ఉన్న భారత్ ను రిషబ్ పంత్, రవి చంద్రన్ అశ్విన్, హనుమ విహారి గట్టెక్కించి మ్యాచ్ డ్రా అయ్యేలా చేసారు. ఇక చివరి టెస్టు నాలుగో ఇన్నింగ్స్ లో 328 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఎవరూ ఊహించని విధంగా లక్ష్యాన్ని ఛేదించి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: