కరోనా ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను షేక్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఒ‍క్కరినీ గడ గడలాడించింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎపుడు.. ఎక‍్కడనుంచి ఎలా వస్తుందో అనే భయం సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు వెంటాడింది. ఇటీవలే తాను కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలినట్లు భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ఆలస్యంగా తెలిపారు.ఈ వివరాలను తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. అయితే దేవుడి దయ వల్ల ప్రస్తుతం అంతా బాగానే ఉందని  తెలిపారు. కరోనా  సమయంలో తన అనుభవాల్ని సానియా మీర్జా ట్వీట్లో పోస్ట్ చేశారు. తనకి కరోనా  పాజిటివ్ అని తేలినప్పటికీ.. తనకు ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని  అయినా తాను ముందు జాగ్రత్త చర్యగా ఐసోలేషన్ లోనే ఉన్నానని అన్నారు.

కొత్త ఏడాదిలో ఏం జరిగిందో చెప్పాలనుకుంటున్నా. నాకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. అయితే దేవుడి దయ వల్ల ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నా. నా అనుభవాల్ని పంచుకోవాలని అనుకుంటున్నా. వైరస్ లక్షణాలేవీ లేకపోవడం నా అదృష్టం. అయినా కూడా ఐసోలేషన్‌లో ఉన్నా. నా రెండేళ్ల కుమారుడికి, కుటుంబానికి దూరంగా ఉండటమే అత్యంత కష్టంగా అనిపించింది' అని సానియా మీర్జా తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో పేర్కొన్నారు.

ఇదే సమయంలో కరోనా బారినపడి అందరికీ దూరంగా ఆస్పత్రులలో ఉన్నప్పుడు వారి కుటుంబాలు ఎలాంటి బాధను అనుభవించాయన్న విషయం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా రోజుకో కొత్త లక్షణం కనిపించినప్పుడు ఎదుర్కోవడం కష్టంగా ఉంటుందని భౌతికంగా మానసికంగా ఎంతో సంఘర్షణకు గురవుతామని తన అనుభవాల్ని వెల్లడించారు.కొడుకుని, కుటుంబసభ్యులను ఎప్పుడు చూస్తానో అనే భయం నాలో ఉండేది. కరోనా వైరస్ సామాన్యమైనది కాదు. నేను ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ నాకు సోకింది. మన కుటుంబాన్ని, స్నేహితులకు కాపాడుకోవడానికి మనం ఎన్ని చేయాలో అన్నీ చేయాలి. మాస్కులు వేసుకోవడం, చేతులు శుభ్రం చేసుకోవడం వంటివి చేయాలి. అందరం కలిసికట్టుగా మహమ్మారిని ఎదుర్కోవాలి' అని సానియా మీర్జా తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: