ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ మ్యాచ్‌ ఎంత రసవత్తరంగా సాగినా ప్రేక్షకుల ఈలలు, కేరింతలు లేకపోతే ఆ మ్యాచ్ చాలా చప్పగా ఉంటుంది. ప్రేక్షకుల గోల చేసి ఉత్సాహ పరుస్తుంటే ఆటగాళ్లకు కూడా మంచి బూస్ట్ లభిస్తుంది. కానీ కరోనా పుణ్యమా అని స్టేడియంలో ప్రేక్షకులే కాకుండా క్రికెట్ మ్యాచ్‌లు కూడా నిలిచిపోయాయి. అయితే ఎలాగోలా మ్యాచ్‌లు తిరిగి ప్రారంభమైనా ప్రేక్షకులను మాత్రం అనుమతించేందుకు క్రికెట్ బోర్డులతో పాటు, ప్రభుత్వాలు కూడా ఇన్నాళ్లూ వెనుకడుగు వేశాయి. కానీ ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ రావడం, కరోనా కూడా తగ్గుముఖం పడుతుండడంతో అనేక క్రికెట్ బోర్డులు మైదానాల్లోకి ప్రేక్షకులను అనుమతిస్తున్నాయి. ఇటీవల జరిగిన భారత్-ఆసీస్ మ్యాచ్‌లలో క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ప్రేక్షకులను అనుమతించింది. ఇప్పుడు భారత క్రికెట్ బోర్డు బీసీసీఐ కూడా మళ్లీ ప్రేక్షకులతో మ్యాచ్‌లు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య వచ్చే నెల నుంచి జరగనున్న టెస్ట్‌ సిరీస్‌‌కు ప్రేక్షకులను స్టేడియాలకు అనుమతించాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే కేవలం 50 శాతం మాత్రమే ప్రేక్షకులను అనుమతించనున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోవడంతో భారత క్రికెట్ అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు.

ఇంగ్లాండ్-భారత్ మధ్య ఫిబ్రవరి 5 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తరువాత 5 టీ20లు, మూడు వన్డేలు కూడా ఈ రెండు జట్లు ఆడనున్నాయి. అయితే కరోనా ప్రభావం ఇప్పటికీ తగ్గకపోవడంత కేవలం మూడు స్టేడియాల్లోనే ఈ మ్యాచ్‌లన్నీ నిర్వహించనున్నారు. మొదటగా జరగనున్న నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లు చెన్నైలో, మిగిలినవి అహ్మదాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్‌లకు స్టేడియంలో సగం వరకు ఫ్యాన్స్‌ను అనుమతించే అవకాశముందని బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు.

చివ‌రిసారి గ‌తేడాది జ‌న‌వ‌రిలో భారత్- ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌రిగిన వ‌న్డే సిరీస్‌నే ప్రేక్ష‌కులు మైదానాల్లోకి వెళ్లి వీక్షించారు. ఆ త‌ర్వాత కరోనా సంక్షోభం మొదలవడంతో భారత్‌లో మ్యాచ్‌లు జ‌ర‌గ‌లేదు. ఐపీఎల్ 2020 సీజన్‌ను కూడా ప్రేక్షకుల్లేకుండా యూఏఈలో నిర్వహించాల్సి వచ్చింది. ఇక దేశవాలి టోర్నీ స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్‌లు కూడా ప్రేక్ష‌కులు లేకుండానే జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో మళ్లీ ప్రేక్షకులను అనుమతించడంతో స్టేడియాలు కళకళలాడడమే కాకుండా ఆటగాళ్లకు కూడా గొప్ప సపోర్ట్ లభించినట్లవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: