ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాపై సూపర్ విక్టరీ సాధించిన టీమిండియా ఇక సొంత గడ్డపై ఇంగ్లాండ్‌తో తలపడనుంది. వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న ఈ టెస్టు సిరీస్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ఇటీవల ప్రకటించింది. అయితే ఈ జట్టులో అనూహ్యంగా విశాఖకు చెందిన ఓ కుర్ర క్రికెటర్‌కు స్థానం కల్పిస్తూ బీసీసీఐ జట్టును ప్రకటించింది. విశాఖలోని మధురవాడకు చెందిన కోన శ్రీకర్ భరత్‌ను స్టాండ్ బై ఆటగాడిగా తీసుకుంది.

ఆసీస్‌తో అద్భుతంగా ఆడిన ఆటగాళ్లను సైతం పక్కన పెట్టి ఓ అరంగేట్ర ఆటగాడిని స్టాండ్‌బైగా ఎంపిక చేయడంపై క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. దీంతో అసలు ఈ భరత్ ఎవరు..?  ఇతడిని బీసీసీఐ ఎలా ఎంపిక చేసింది..? అనే విషయాలపై క్రికెట్ అభిమానులు తెగ ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా దీనిపై పెద్ద చర్చే నడుస్తోంది. అతడి గురించి తెలుసుకునేందుకు ఆన్‌లైన్‌లో తెగ వెతికేస్తున్నారు.

కోన శ్రీకర్ భరత్ ఆంధ్ర క్రికెట్ టీంలో వికెట్ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌గా ఆడుతున్నాడు. 2015లో తొలిసారిగా రంజీ ట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ చేసిన ఏకైక వికెట్ కీపర్‌గా కేఎస్ భరత్ చరిత్ర సృష్టించాడు. దీంతో అతడిపై బీసీసీఐ దృష్టి పడింది. ఆ తరువాత కూడా శ్రీకర్ భరత్ ఎన్నో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో అతడిని భారత జట్టుకు ఎంపిక చేయడం జరిగింది. ఇప్పటివరకు శ్రీకర్ భరత్ తన కెరీర్లో 78 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడగా.. అందులో 9 సెంచరీలు, 23 అర్థ సెంచరీలతో, 37.2 సగటుతో 4283 పరుగులు చేశాడు. ఇక 51 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడిన భరత్ 3  సెంచరీలు, 5 అర్థ సెంచరీలతో 28.1 సగటుతో 1351 పరుగులు చేశాడు.

ఇదిలా ఉంటే ఆస్ట్రేలియతో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత యువ ఆటగాళ్లు అదరగొట్టారు. ఎవరో ఒకరిద్దరు కాదు. జట్టంతా సమష్టిగా ఆడి.. చారిత్రాత్మక విజయం సాధించింది. ఈ విజయంలో అరంగేట్ల ఆటగాళ్లైన నటరాజన్, వాషింగ్టన్ సుందర్‌లతో పాటు అనుభవజ్ఞులైన పుజారా రహానేలూ ఉన్నారు. అయితే అంతగా రాణించినప్పటికీ ఇంగ్లాండ్ సిరీస్‌ కోసం వీరిలో కొందరిని బీసీసీఐ ఎంపిక చేయలేదు.

ముఖ్యంగా నటరాజన్‌ను జట్టు నుంచి తప్పించడం, అతడి స్థానంలో అక్షర్ పటేల్‌ను జట్టులోకి తీసుకోవడం కొందరికి ఆశ్చర్యం కలిగించింది. అయితే భారతీయ పిచ్‌లపై నటరాజన్‌తో పోల్చితే ఇంగ్లండ్ ఆటగాళ్లను అక్షర్ గొప్పగా ఎదుర్కోగలడని, అందుకే అతడిని ఎంపిక చేశామని సెలక్షన్ కమిటీ చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: