ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని అభిమానుల మనసు దోచుకున్న టీమిండియా స్వదేశానికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక స్వదేశంలో బలమైన ఇంగ్లాండ్ జట్టుతో పోరుకు సిద్ధమవుతోంది టీమిండియా. ఫిబ్రవరి 5 నుండి  సీరీస్ ప్రారంభం కానుండగా ఇరుజట్లు కూడా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అయితే స్వదేశంలో జరిగే ఈ సిరీస్ లకు మొదట ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించాలని బీసీసీఐ భావించినప్పటికీ ప్రస్తుతం ఆలోచనను హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తుంది. చెన్నై వేదికగా జరగనున్న తొలి రెండు టెస్టులకు ప్రేక్షకులను అనుమతించడంలేదని తమిళనాడు క్రికెట్ సంఘం కార్యదర్శి రామస్వామి ప్రకటించారు. కరోనా ఉద్ధృతి  తమిళనాడులో అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

 దీంతో తొలి రెండు టెస్టులకు ప్రేక్షకులను అనుమతించడం లేదని,కరోనా వ్యాప్తి నేపథ్యంలో క్రికెటర్లు, ప్రేక్షకుల భద్రత దృష్ట్యా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఇదిలా ఉండగా క్రికెట్ అభిమానులకు అసలైన క్రికెట్ మజా రుచి చూపించే ఐపీఎల్ కు అంతా సిద్ధమవుతోంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 2021 సీజన్‌కు ముందే ఆటగాళ్ల వేలం నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్టు తెలుస్తుంది. రాబోయే సీజన్‌కు సంబంధించిన ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 18న జరిగే అవకాశం ఉందని  బీసీసీఐ అధికారి  శుక్రవారం  పీటీఐకి తెలిపారు.

అయితే ఈ ఏడాది ఐపీఎల్‌ భారత్‌లో జరుగుతుందా లేదా అనే విషయంపై  బీసీసీఐ ఎలాంటి స్పష్టత ఇవ్వనప్పటికీ, రాబోయే సీజన్‌ను స్వదేశంలో నిర్వహించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే వచ్చే నెలలో ఇంగ్లాండ్ తో భారత్‌ సిరీస్‌ సజావుగా జరిగితే స్వదేశంలోనే ఐపీఎల్‌ నిర్వహించడానికి మార్గం సుగమం అవుతుంది. మరి క్రికెట్ అభిమానులు స్టేడియంలో మ్యాచ్ చూసి ఆస్వాదించాలని కోరుకుంటున్న తరుణంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: