ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమిండియా కుర్ర ఆటగాళ్లకు ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్‌ మహీంద్ర బంపర్ ఆఫర్ ప్రకటించారు. జట్టులోకి కొత్తగా వచ్చినప్పటికీ సూపర్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన కుర్ర ఆటగాళ్లకు భారీ బహుమతులను ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఆస్ట్రేలియాతో జాతిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ కు విజయాన్ని కట్టబెట్టిన ఆటగాళ్లలో  ఆరుగురిని ప్రత్యేకంగా ప్రశంసించారాయన. వారికి ఖరీదైన కార్లను బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. శార్దూల్‌ ఠాకుర్, మహ్మద్‌ సిరాజ్‌, శుభ్‌మన్‌గిల్‌, నవ్‌దీప్‌ సైని, వాషింగ్టన్‌ సుందర్, నటరాజన్‌లకు‌ తమ కంపెనీ నుంచి థార్ ఎస్యూవీ కార్లను గిఫ్ట్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

 ఈ ఆరుగురూ తమ జీవితాల్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారని, వీరివి నిజ జీవిత విజయగాథలని ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. అసాధ్యాలను సుసాధ్యం చేసుకోవాలనుకునే భావి భారత పౌరులకు వీరు నిజమైన ఆదర్శమని కొనియాడారు. యువత ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతోనే వీరిని బహుమతులతో ప్రోత్సహించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

ఇదిలా ఉంటే ఆసీస్ సిరీస్ లో ఆటగాళ్లంతా సమిష్టిగా రాణించి విజయం సాధించారు. ముఖ్యంగా నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో యువ ఆటగాళ్లు శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ చూపిన తెగువ అత్యద్భుతం. 369 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 185 పరుగులకే కీలక వికెట్లన్నీ కోల్పోయింది. ప్రధాన బ్యాట్స్ మెన్ అంతా పెవిలియన్ చేరారు. ఇక మిగతా వారంతా బౌలర్లే కావడంతో ఆసీస్ భారీ ఆధిక్యం దక్కించుకోవడం ఖాయంగా కనిపించింది.

కనీసం 100 పరుగులకు తగ్గకుండా ఆసీస్ ఆధిక్యం ఉండేలా కనిపించింది. అదే జరిగితే ఇక భారత్ చేతినుంచి మ్యాచ్ చేజారిపోయినట్లే. కానీ ఆరంగేట్ర ఆటగాళ్లు శార్దూల్, సుందర్ ఆశ్చర్యంగా ఆసీస్ బౌలర్లకు ఎదురు తిరిగారు. వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూనే బౌండరీలతో రెచ్చిపోయారు. చూస్తుండగానే స్కోరు బోర్డు 300 పరుగులు దాటేసింది. ఇద్దరూ అర్ధ సెంచరీలతో రాణించారు. దీంతో కేవలం 33 పరుగులు మాత్రమే వెనుకబడింది టీమిండియా.

ఇక రెండో ఇన్నింగ్స్ లో శుభ్ మన్ గిల్ 91 పరుగులతో ఓపెనర్ గా అదరగొట్టగా.. చివర్లో రిషబ్ పంత్ ఆసీస్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. చివరి వరకు క్రీజులో నిలబడి భారత జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు. దీంతో గబ్బా పిచ్ పై తొలిసారిగా ఆస్ట్రేలియాను టీమిండియా మట్టికరిపించింది. బ్యాట్స్ మెన్ మాత్రమే కాకుండా యువ బౌలర్లు కూడా సత్తా చాటారు. రెండో ఇన్నింగ్స్‌లో మహమ్మద్ సిరాజ్ 5 వికెట్లు తీసి కెరీర్లోనే తొలిసారి ఈ ఫీట్ సాధించాడు. ఇక నెట్ బౌలర్ గా వచ్చినప్పటికీ అనూహ్యంగా జట్టులో స్థానం సంపాదించుకున్న నటరాజన్‌ కూడా చక్కగా రాణించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: