ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్‌లో బ్యాటింగ్‌కు ఎంత విలువుంటుందో బౌలింగ్‌కు అంతకు మించిన ప్రాధాన్యం ఉంటుంది. అందుకే శతాబ్దాలుగా బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లకూ అత్యుత్తమ గుర్తింపు లభిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే అనేకమంది లెజెండరీ బౌలర్లుగా కూడా అవతరించారు. కర్ట్నీ వాల్ష్, డెన్నిస్ లిల్లీ, రిచర్డ్ హ్యాడ్లీ, కపిల్ దేవ్, కర్ట్‌లీ ఆంబ్రోస్, గ్లెన్ మెక్‌గ్రాత్, మత్తయ మురళీధరన్, వకార్ యూనిస్, డేల్ స్టెయిన్, అనిల్ కుంబ్లే, లసిత్ మలింగ వంటి అనేక మంది లెజెండరీ బౌలర్లు చరిత్రలో నిలిచిపోయారు.

ఇప్పుడు కూడా అనేకమంది అత్యుత్తమ బౌలర్లు వివిధ జట్లలో ఉన్నారు. అయితే వీరందరిలో బెస్ట్ ఎవరంటే చెప్పడం కొంత కష్టమే. ఈ క్రమంలోనే భారత మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తన దృష్టిలో ప్రస్తుతం టాప్ బౌలర్ ఎవరో చెప్పేశాడు.

ఈ మధ్యకాలంలో క్రికెట్లో అడుగుపెట్టిన బౌలర్లలో ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ నెంబర్ వన్ బౌలర్ అంటూ భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అభిప్రాయపడ్డాడు. ఆర్చన్ ఉన్న ఫామ్‌ను ఒకసారి పరిశీలిస్తే, ఇది కచ్చితంగా ఇంగ్లండ్ జట్టుకు బలంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. భారత్‌తో జరిగే మూడో టెస్టులో ఆర్చర్ ఓ ఆయుధంలా మారే అవకాశం ఉందన్నాడు. ‘ఇంగ్లండ్ పేస్ దళాన్ని ఒక్కసారి పరిశీలిస్తే.. వారికి పేసర్లకు కొదవ లేదు. రూట్ వారిని మైదానంలో సక్రమంగా వినియోగిస్తే అద్భుత ఫలితాలను రాబట్టవచ్చు.

ఉదాహరణకు మొదటి టెస్టులో స్టువర్ట్ బ్రాడ్‌‌కు ఫాం లేదు. కానీ రెండో టెస్టుకల్లా అతడు తన ఫాంను అందిపుచ్చుకున్నాడు. అయితే అతడికి బంతినివ్వడంలో రూట్ ఆలస్యం చేశాడు. ఇక ఆర్చర్ విషయానికొస్తే.. గత రెండు మూడేళ్లలో అరంగేట్రం చేసిన బౌలర్లలో నాకు తెలిసి అతడే గ్రేట్. తన కెరీర్‌లో కేవలం 12 టెస్టులే ఆడినా.. అందులో 41 వికెట్లు కూల్చాడు. జోఫ్రా ఎంతో ప్రతిభ ఉన్న బౌలర్. అతడి ఫాంను బట్టి చూస్తే ఇంగ్లండ్‌కు అతడు గొప్పగా ఉపయోగపడగలడు’ అంటూ నెహ్రా చెప్పుకొచ్చాడు.


ఇదిలా ఉంటే జోఫ్రా ఆర్చర్ 2019లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో తన తొలి మ్యాచ్ ఆడాడు. మెగా టోర్నీలో ఓ కొత్త పేసర్‌తో బరిలోకి దిగితే ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టవచ్చని ఇంగ్లండ్ భావించింది. అనుకున్నట్లుగానే ఆర్చర్‌ను తీసుకొచ్చింది. అతడు అంచనాలను అందుకున్నాడు. టోర్నీ మొత్తం అద్భుతంగా రాణించాడు. ఫైనల్ మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌ను కూడా చక్కగా వేసి న్యూజిల్యాండ్‌ను కట్టడి చేశాడు. అయితే గడిచిన రెండు, మూడేళ్లలో  భారత్ తరఫున కూడా చాలా మంది పేసర్లు అరంగేట్రం చేశారు. కానీ వారి పేర్లేవీ నెహ్ర ప్రస్తావించకపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: