ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ రికార్డు బద్దలైంది. ఇప్పటివరకు టీ20ల్లో అత్యధిక సిక్సులు బాదిన బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డును ఓ న్యూజిల్యాండ్ బ్యాట్స్‌మన్ తిరగరాశాడు. గురువారం జరిగిన న్యూజిల్యాండ్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్‌లో అతడు ఈ ఘనత సాధించాడు. న్యూజిల్యాండ్-ఆస్ట్రేలియా మధ్య 5 టీ20ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సిరిస్‌లో భాగంగా గురువారం రెండో టీ 20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కివీస్ ఓపెనర్, సినియర్ బ్యాట్స్‌మన్ మార్టిన్ గప్తిల్ ఈ రికార్డు నెలకొల్పాడు. గ‌ఫ్తిల్ కేవ‌లం 50 బంతుల్లోనే (8 సిక్స్‌లు, 6 ఫోర్లు)తో కలిపి 97 ప‌రుగులు పూర్తి చేయగలిగాడు.

ఈ మ్యాచ్‌లో 8 సిక్సులు బాదడంతో గప్తిల్ టీ20ల్లో ప్ర‌పంచంలోనే అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన బ్యాట్స్‌మ‌న్‌గా నిలిచాడు. గ‌ఫ్తిల్ ఇప్ప‌టి వ‌ర‌కు 96 టీ20లు ఆడి 132 సిక్స్‌లు కొట్టాడు. దీంతో అత్యధిక సిక్సుల రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు రోహిత్ శ‌ర్మ పేరిట (127 సిక్స్‌లు, 108 మ్యాచ్‌లు)గా ఉండేది. ఇద్ద‌రి త‌ర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయోన్ మోర్గాన్ (97 మ్యాచ్‌ల‌లో 113 సిక్స్‌లు), న్యూజిలాండ్‌కు చెందిన కొలిన్ మ‌న్రో (107), విండీస్ వీరుడు క్రిస్ గేల్ (105) ఉన్నారు. అయితే గేల్ అన్ని సిక్సులను కేవ‌లం 58 మ్యాచ్‌ల‌లోనే బాదడం గమనార్హం.

మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్‌.. గ‌ఫ్తిల్ మెరుపు ఇన్నింగ్స్‌‌తో 20 ఓవ‌ర్లలో 219 ప‌రుగులు చేసింది. ఆ త‌ర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా కూడా ధాటిగానే ఆడింది. కానీ విజ‌యానికి మరో 15ప‌రుగులు అవ‌స‌రం కాగా.. కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. కివీస్ బౌలర్ నీష‌మ్ చివరి ఓవర్లో ఆస్ట్రేలియాను కట్టడి చేసి కేవలం 10 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చాడు. దీంతో ఆసీస్‌కు ఓటమి తప్పలేదు. దీంతో మ్యాచ్ గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ 2-0 లీడ్‌ దక్కించుకుంది.

ఇదిలా ఉంటే రోహిత్ శర్మ మళ్లీ ఈ రికార్డును తన పేరు మీద మార్చుకునే అవకాశం త్వరలోనే ఉంది. వచ్చే నెల నుంచి ఇంగ్లండ్‌తో జరగబోతున్న 5 టీ20ల సిరీస్‌లో రోహిత్ మళ్లీ భారీ ఇన్నింగ్స్ ఆడి ఈ రికార్డును గప్తిల్‌‌ నుంచి లాక్కునే అవకాశం లేకపోలేదు. అయితే మిగతా 3 టీ20లలో గప్తిల్ ఇంకెంత భయకరంగా ఆడతాడో, ఇంకా ఎన్ని సిక్సులు కొడతాడో వేచి చూడాలి. మరో విచిత్రమేమంటే ఇంత భీకర ఫాంలో ఉన్నప్పటికీ మార్టిన్ గప్తిల్‌ను 2021 ఐపీఎల్ మీనీ వేలంలో ఎవరూ కొనుగోలు చేయలేదు. దీంతో ఈ ఏడాది ఐపీఎల్‌లో గప్తిల్ మెరుపులు మనకు కనిపించే అవకాశం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: