ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు అతడో భీకర బ్యాట్స్‌మన్. ఒంటి చేత్తో జట్టును గెలిపించగల బ్యాట్స్‌మన్. అతడు క్రీజులో ఉన్నాడంటే టీమిండియాకు కచ్చితంగా గెలుపు సాధ్యమని ప్రేక్షకులంతా అనుకునే వారు. కానీ కాలం అన్ని వేళలా ఒకేలా ఉండదు. ఆ మార్పుల వల్ల అతడు కూడా కనుమరుగయ్యాడు. ఇప్పుడు ఏకంగా తన కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఈ సందర్భంగా చాలా ఉద్విగ్నభరితంగా మాట్లాడాడు. అతడే యూసుఫ్ పఠాన్.

 సోషల్ మీడియా వేదికగా శుక్రవారం తన రిటైర్మెంట్ ప్రకటించిన యూసుఫ్ పఠాన్.. తనకు ఇన్నాళ్లుగా ఎంతో మద్దతునిచ్చిన కుటుంబానికి, స్నేహితులకు, జట్టుకు, కోచ్‌లకు, దేశంలోని ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాడు.

తన జీవితంలో టీమిండియాతో గడిపిన సమయం మధురమైందని, తాను తొలిసారిగా టీమిండియా జెర్సీ ధరించిన రోజును ఇప్పటికీ మర్చిపోలేనని యూసుఫ్ చెప్పుకొచ్చాడు. ‘తొలిసారిగా టీమిండియా జెర్సీ వేసుకున్నప్పుడు నాకు ఒక్కటే అనిపించింది. నేను టీమిండియా జెర్సీ మాత్రమే ధరించలేదు. మొత్తం దేశ ప్రజల బాధ్యతను నా భుజాలపైకి తీసుకున్నానని భావించాన’ని యూసుఫ్ తన  రాసుకొచ్చాడు.

చిన్నప్పటి నుంచి తన జీవితం మొత్తం క్రికెట్‌తోనే ముడిపడి ఉందని చెప్పిన యూసుఫ్.. తన కెరీర్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్, అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్.. ఇలా రకరకాల టోర్నీలు ఆడానని, అలా ఆడేటప్పుడు ఎంతో గొప్ప అనుభూతిని పొందానని, కానీ 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్‌లు గెలవడం, ఆ జట్లలో తానుకూడా సభ్యుడిగా ఉండడం ఎప్పటికీ మరువలేనని అన్నాడు.

అలాగే 2011 ప్రపంచకప్ తర్వాత క్రికెట్ లెజెండ్ సచిన్‌ టెండూల్కర్‌ను భుజాలపై మోసిన క్షణాలను తాను బతికున్నంత కాలం మర్చిపోలేనని అన్నాడు. ఈ అవకాశాలు ఇచ్చిన బీసీసీఐ, బరోడా క్రికెట్‌ అసోషియేషన్‌కు ధన్యవాదాలంటూ యూసుఫ్ చెప్పాడు.

‘ఈ రోజు ప్రపంచకప్ లేదు ఐపీఎల్ లేదు. కానీ తన జీవితంలో ఈ రోజు ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే నేను అంతర్జాతీయ క్రికెట్ నుంచి నేడు పూర్తిగా వైదొలుగుతున్నాను. అధికారికంగా నేను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకున్నాను. ఈ క్రమంలో నేను నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు చెబుతున్నాను. నా తదుపని ఇన్నింగ్స్‌కు కూడా మీ అందరి మద్దతు ఇలానే లభిస్తుందని అనుకుంటున్నానం’టూ యూసుఫ్ పఠాన్ చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉంటే యూసుఫ్ పఠాన్ తన కెరీర్లో టీమిండియా తరపున 57 వన్డేలు, 22 టీ20లు ఆడాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా తరపున యూసుఫ్ కూడా ఓ విధ్వంసక బ్యాట్స్‌మెన్‌గా పేరు సంపాదించాడు. 2011 ప్రపంచకప్‌ జట్టులో యూసుఫ్ సభ్యుడిగా ఉన్నాడు. చివరిగా 2012లో సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో యూసుఫ్ టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: