పూణె: ఇండియా-ఇంగ్లండ్ మధ్య వచ్చే నెల వన్డే సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పుడు జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా దుమ్ము దులుపుతోంది. ఇంగ్లండ్‌ను మట్టి కరిపిస్తోంది. అయితే ఈ టెస్ట్ సిరీస్ తరువాత 5 టీ20ల సిరీస్ జరగనుంది. ఆ సిరీస్ తరువాత 3 వన్డేల సిరీస్ జరగనుంది. అయితే టీ20లను అహ్మదాబాద్‌లోనే నిర్వహిస్తున్న బీసీసీఐ వన్డేలను పూణె స్టేడియంలో నిర్వహించేందుకు సిద్ధమైంది. కానీ అనుకోకుండా మహారాష్ట్రలో మళ్లీ కరోనా విజృంభించడంతో పూణేలో ఈ సిరీస్ జరగదేమోనని అంతా భయపడ్డారు. కరోనా విపరీతంగా పెరిగిన కారణంగా ఇండియా-ఇంగ్లండ్ మధ్య మార్చి నుంచి జరగాల్సిన వన్డే మ్యాచ్‌లు పూణేలో జరుగుతాయా..? లేదా..? అనే అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే  ఈ మ్యాచ్‌లను బీసీసీఐ వేరే చోటికి మార్చే ఆలోచనలో ఉందంటూ అనేక రూమర్లు కూడా వచ్చాయి. అయితే వీటన్నింటినీ పక్కన పెడుతూ పూణేలోనే మ్యచ్‌లను నిర్వహించేందుకు బీసీసీఐ రెడీ అయింది.

తాజాగా సీఎం ఉద్ధవ్ కూడా పూణేలో వన్డే సిరీస్ నిర్వహించుకునేందుకు ఆయన అంగీకరిస్తూ ఆదేశాలు జారీ చేయడంతో వన్డే సిరీస్‌కు స్టేడియం ఖరారైంది. అయితే ప్రేక్షకులకు మాత్రం ఉద్ధవ్ సర్కార్ పెద్ద షాక్ ఇచ్చింది. స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించేందుకు నిరాకరించింది. దీంతో ఏడాదిగా క్రికెట్‌ను లైవ్‌లో చూడని పుణే ప్రేక్షకులు.. ఈ సిరీస్‌తో అయినా ఆశ నెరవేరుతుందని అనుకున్నారు. కానీ వారి ఆశ నిరాశగానే మిగిలింది. అయితే ఇప్పటికే ఈ వన్డే సిరీస్‌ నిర్వహించేందుకు పూణే స్టేడియంలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.

ఇదిలా ఉంటే ఇండియా-ఇంగ్లండ్ మధ్య ప్రస్తుతం జరగనున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా పట్టు బిగించింది. తొలి టెస్టు ఓడిపోయినా.. తరువాతి రెండు టెస్టుల్లో విజయం సాధించడమే కాకుండా ఇంగ్లండ్‌ను ఘోరంగా ఓడించింది. దీంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యం సాధించింది. ఇక వచ్చే నెలలో ప్రారంభం కానున్న నాలుగో టెస్టుతో సిరీస్ విజేత ఎవరనేది తేలనుంది. ఈ సిరీస్ విజేత జూన్‌లో లార్డ్స్ మైదానంలో జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో న్యూజిల్యాండ్‌‌తో తలపడనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: