ఇంటర్నెట్ డెస్క్: ఒక్క సిరీస్ ముందు అసలు టెస్టు జట్టులో స్థానం దక్కుతుందా..? అని అనుకున్నారు. ఆ తరువాత జట్టులోకొచ్చినా అంతగా ఆడకపోవడంతో ఇలా అయితే కష్టమే.. అనుకున్నారు. కానీ ఇప్పుడు తానో చక్కటి టెస్టు బ్యాట్స్‌మన్‌నని నిరూపించుకున్నాడు. అతడే టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ. అంతేకాదు తన కెరీర్లోనే టెస్టు ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమ ర్యాంక్ సాధించాడు. ఆదివారం ఐసీసీ ప్రకటించిన టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో రోహిత్ ఏకంగా 6 స్థానాలు మెరుగుపర్చుకొని 8వ ర్యాంక్‌‌లో నిలిచాడు. రోహిత్ టెస్ట్ కెరీరల్లోనే ఇది బెస్ట్ ర్యాంక్. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న 4 టెస్టుల సిరీస్‌లో రోహిత్‌ ఒక భారీ శతకంతో పాటు ఒక అర్ధ శతకం సాధించి సత్తా చాటాడు. దీంతో ఈ సిరీస్‌లో హిట్‌మ్యాన్‌ మూడు టెస్టుల్లో 298 పరుగులు చేశాడు. భారత్‌ తరఫున ఓపెనింగ్ స్థానానికి సరిగ్గా సరిపోయాడని ప్రశంసలు అందుకుంటున్నారు.

మరోవైపు సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ చతేశ్వర్‌ పుజారా ఈ సిరీస్‌లో పెద్దగా రాణించకపోవడంతో రెండు స్థానాలు దిగజారి పదో ర్యాంక్‌తో సరిపెట్టుకున్నాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఐదో ర్యాంక్‌లోనే కొనసాగుతుండగా, న్యూజిల్యాండ్ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ఆ తరువాత ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ స్టీవ్‌స్మిత్‌ రెండో స్థానంలో, ఆసీస్ ఆటగాడు మార్నస్‌ లబుషేన్‌ మూడో స్థానంలో, ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జోరూట్‌ నాలుగో స్థానంలో ఉన్నారు.

బౌలింగ్‌ విభాగంలో రవిచంద్రన్‌ అశ్విన్‌ 4 స్థానాలు మెరుగుపర్చుకొని మూడో ర్యాంక్‌ సాధించాడు. పింక్‌ బాల్‌ టెస్టులో 400 వికెట్ల మైలురాయి అందుకున్న అశ్విన్‌ బౌలర్ల జాబితాలో టాప్‌ 10లో చోటు దక్కించుకున్న ఏకైక స్పిన్నర్‌గా రికార్డు సృష్టించాడు. యువ స్పిన్నర్‌ అక్షర్‌పటేల్‌ కూడా టెస్టు ర్యాంకింగ్స్‌లో కొంత మెరుగుపడి 38వ ర్యాంక్‌లో ఉన్నాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఆసీస్ పేసర్ పాట్‌ కమిన్స్ తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిల్యాండ్ పేసర్ నీల్‌ వాగ్నర్‌ రెండో స్థానంలో ఉన్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: