ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా-ఇంగల్ండ్ మధ్య ఇటీవల జరిగిన మూడు టెస్టుల్లో వాడిన పిచ్‌లపై అనేకమంది ఇంగ్లండ్, ఆసిస్ మాజీ క్రికెటర్లు తమ అక్కసు వెళ్లగక్కుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మూడో టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగియడంతో పలువురు ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు టీమిండియాను, భారత క్రికెట్ బోర్డు..(బీసీసీఐ)ని తీవ్రంగా విమర్శించారు.  ఆ పిచ్ భారత్ తనకు అనుకూలంగా తయారు చేసుకుందుని, ఇలాంటి పిచ్‌లలో ఆడి గెలిస్తే అది గెలుపే కాదని నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఈ క్రమంలోనే అహ్మదాబాద్ స్టేడియంలోనే జరగనున్న నాలుగో టెస్టుకు పిచ్‌లో కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సారి స్పిన్ పిచ్ కాకుండా విదేశాల్లో ఉండే పిచ్‌లలా స్వచ్ఛమైన బ్యాటింగ్ పిచ్‌ను తయారు చేయనున్నట్లు తెలుస్తోంది.

టీమిండియా-ఇంగ్లండ్ మధ్య పేటీఎం టెస్ట్ సిరీస్‌లో భాగంగా గురువారం నుంచి జరగనున్న నాలుగో టెస్టుకు బ్యాటింగ్ పిచ్ రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీసీసీఐ వ్యూహాత్మకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వస్తున్న విమర్శలనుంచి తప్పించుకోవడంతో పాటు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుంచి ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకునేందుకే బీసీసీఐ ఈ తరహా పిచ్‌ను రెడీ చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

నాలుగో టెస్టుకి బ్యాటింగ్‌ పిచ్‌ని రూపొందిస్తే.. మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదవడమే కాకుండా.. ఆట కూడా పూర్తిగా 5 రోజులు జరిగే అవకాశం ఉంది. అప్పుడు ఐసీసీ కూడా ఒకే స్టేడియంలో ఒక బ్యాడ్, గుడ్ పిచ్ ఉంటే ఎలాంటి చర్యలు తీసుకోదు. ఒకవేళ నాలుగో టెస్టు కూడా స్పిన్‌కి అతిగా సహకరించి.. 2-3 రోజుల్లోనే మ్యాచ్ ముగిసిపోతే..? మొతెరా స్టేడియంలో 2021 టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ఆతిథ్యానికి ఐసీసీ ఒప్పుకోకపోవచ్చు. అలానే ఐపీఎల్ 2021 ప్లేఆఫ్ మ్యాచ్‌లను కూడా అక్కడ నిర్వహించేందుకు విముఖత చూపవచ్చు. ఈ క్రమంలోనే ఐసీసీ ఆగ్రహం నుంచి తప్పించుకోవాలంటే నాలుగో టెస్టుకి బ్యాటింగ్ పిచ్ తయారుచేయడం ఒక్కటే దారిగా బీసీసీఐ భావిస్తోంది.

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ఇప్పటికే టాప్‌లో కొనసాగుతున్న భారత్ జట్టు.. ఫైనల్ బెర్తుని ఖాయం చేసుకోవాలంటే ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టుని డ్రా చేసుకున్నా చాలు. దాంతో.. బ్యాటింగ్ పిచ్‌ వల్ల మ్యాచ్ డ్రా అయ్యే సూచనలే ఎక్కువ. ఇక ఆఖరిగా మ్యాచ్ రిఫరీగా వ్యవహరిస్తున్న జవగళ్ శ్రీనాథ్ ఇచ్చే రిపోర్ట్‌ని బట్టి పిచ్‌పై ఐసీసీ చర్యలు తీసుకోనుంది. ఇప్పటి వరకూ మూడో టెస్టుపై ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ఈ క్రమంలో నాలుగో టెస్టు విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి అన్ని ఇబ్బందుల నుంచి ఒకే దెబ్బకు గట్టెక్కాలని బీసీసీఐ భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: