ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్, యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌లకు బీసీసీఐ విశ్రాంతినివ్వనుంది. ఈ మేరకు భారత క్రికెట్ బోర్డు..బీసీసీఐ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. గతేడాది ఐపీఎల్‌ సీజన్‌ కోసం దుబాయ్‌ వెళ్లిన టీమిండియా ఆటగాళ్లు అప్పటి నుంచి సెలవు లేకుండా క్రికెట్ ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వాలని జట్టు యాజమాన్యం ఆలోచన చేస్తోందట. ఇంగ్లండ్‌తో జరుగబోయే మూడు వన్డేల సిరీస్‌ కోసం టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, రిషబ్‌ పంత్‌, వాషింగ్టన్ సుందర్‌లతో సహా మొత్తం 8 మంది ఆటగాళ్లను పక్కన పెట్టనుందట.

గతేడాది కరోనా విజృంభించడంతో దాదాపు 7 నెలల పాటు ఎక్కడా క్రికెట్ ఊసే లేకుండా పోయింది. అయితే కరోనా అనంతరం క్రికెట్ మొదలైనప్పటి నుంచి టీమిండియా ఆటగాళ్లు బయో‌ బబుల్‌కే పరిమితమవుతూ.. ఐపీఎల్ కోసం దుబాయ్, ఆసీస్ టూర్ కోసం ఆస్ట్రేలియా ఇలా విదేశాలు తిరుగుతూనే ఉన్నారు. ఇక ఇప్పుడు స్వదేశంలో జరుగుతున్న ఇంగ్లండ్ సిరీస్‌లోనూ బయోబబుల్‌లోనే ఉంటూ సిరీస్ ఆడుతున్నారు. ఇలా ఎక్కువ కాలం బయోబబుల్‌లో ఉండడం వల్ల తీవ్రమైన మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదముందని వైద్యులు హెచ్చరించారట. ఈ క్రమంలోనే బీసీసీఐ తాజా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఐపీఎల్ 2021 సీజన్‌కు ముందు స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతినిస్తే వాళ్లంతా మళ్లీ ఫ్రెష్ మైండ్‌తో క్రికెట్ ఆడగలరని బీసీసీఐ భావిస్తోందట.  ఇప్పటికే స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా బీసీసీఐని వ్యక్తిగతంగా రెస్ట్ కోసం కోరాడు. దీంతో అతడికి టీం మేనేజ్‌మెంట్ రెస్ట్ ఇచ్చింది. నాలుగో టెస్టుకు అతడిని ఎంపిక చేయలేదు. నాలుగో టెస్టు సహా వన్డే, టీ20 సిరీస్‌లకు సైతం బుమ్రా దూరం కానున్నాడు. భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య 5 టీ20ల సిరీస్‌తో పాటు, 3 వన్డేల సిరీస్‌ కూడా ఈ నెలలోనే జరగనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: