ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా-ఇంగల్ండ్ మధ్య ఇటీవల జరిగిన మూడు టెస్టుల్లో వాడిన పిచ్‌లపై అనేకమంది ఇంగ్లండ్, ఆసిస్ మాజీ క్రికెటర్లు తమ అక్కసు వెళ్లగక్కుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన పింక్ బాల్ టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగియడంతో పలువురు ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు టీమిండియాను, భారత క్రికెట్ బోర్డు..(బీసీసీఐ)ని తీవ్రంగా విమర్శించారు.  ఆ పిచ్ భారత్ తనకు అనుకూలంగా తయారు చేసుకుందుని, ఇలాంటి పిచ్‌లలో ఆడి గెలిస్తే అది గెలుపే కాదని నోటికొచ్చినట్లు మాట్లాడారు. అయితే ఆసీస్ స్పిన్నర్ నేథన్ లియాన్ మాత్రం అహ్మదాబాద్ పిచ్‌ను గొప్పగా ప్రశంసించాడు.

‘అహ్మదాబాద్ పిచ్‌ను తయారు చేసిన క్యురేటర్‌ను సిడ్నీ క్రికెట్ గ్రౌండ్(ఎస్‌సీజీ)కి తీసుకురావాలనుకుంటున్నా. ఇక్కడి పిచ్‌ను కూడా అలా మారిస్తే బాగుటుందని నేను అనుకుటున్నాను’ అంటూ లియాన్ పేర్కొన్నాడు. పిచ్‌లు స్పిన్‌కు అనుకూలించినప్పుడే ప్రపంచం మొత్తం విమర్శలు గుప్పిస్తుందని అన్నాడు. తాము ప్రపంచంలో పేస్ వికెట్ పై ఆడి 47 లేదా 60 పరుగులకు ఆలౌట్ అయినప్పుడు వారందిరి నోళ్లు ఏమాత్రం తెరుచుకోవని, కానీ ఒక్కసారి పిచ్ స్పిన్‌కు అనుకూలించి వాళ్ల జట్లు ఇబ్బందులు పడగానే అదేదో పెద్ద నేరంగా మాట్లాడుతారని విమర్శనాస్త్రాలు సంధించాడు. తాను ఆ మ్యాచ్ మొత్తం చూశానని, చాలా ఎంజాయ్ చేశానని లియాన్ అన్నాడు.

ఇదిలా ఉంటే హైదరాబాద్‌కు చెందిన మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓఝా కూడా ఇంగ్లండ్ ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్టువర్ట్ బ్రాడ్ 15 పరుగులకే 8 వికెట్లు తీసినప్పుడు ఎవరూ విమర్శించలేదని, ఆ పిచ్‌‌పై గడ్డి ఉండి.. పేస్ బౌలింగ్‌కు అనుకూలించే పిచ్ అని, అప్పుడు మ్యాచ్ రెండు మూడు రోజుల్లో పూర్తయిపోతే ఎవరూ మాట్లాడరని, కానీ స్పిన్ తిరిగి రెండ్రోజుల్లోనే ముగిస్తే మాత్రం పిచ్‌పై ఎక్కడలేని విమర్శలు చేస్తారని, అసలు ఆ పిచ్ టెస్ట్ వికెట్‌కు పనికిరాదని అంటారని, ఇది సరైన పద్ధతి కాదని  ఓఝా ఆగ్రహం వ్యక్తం చేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: