ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. మైదానంలో పరుగుల వరద పారించే కోహ్లీ.. సోషల్ మీడియాలో కూడా కోట్లమంది అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్‌ ఫాలోవర్ల(10 కోట్లు)ను సొంతం  చేసుకున్నాడు. ఇది అంత ఆషామాషీ విషయం కాదు. ఆసియా ఇంతమంది ఫాలోవర్లు ఉన్న ఏకైక వ్యక్తిగా విరాట్‌ రికార్డు సృష్టించాడు. సోమవారం నాటికి ఇన్‌స్టాలో కోహ్లీ ఫాలోవర్ల సంఖ్య సరిగ్గా వంద మిలియన్లు చేరుకుంది. అయితే క్రీడాకారుల్లో ఇంతమంది ఫాలోవర్లు ఉన్న ఏకైక క్రికెటర్‌గా కూడా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు.

ఇక.. ఓవరాల్‌గా స్పోర్ట్స్ పర్సన్‌లో కూడా ఆసియా తరపున కోహ్లీనే నెంబర్ వన్‌గా ఉన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా సాకర్‌ స్టార్లు క్రిస్టియానో రొనాల్డో(266 మిలియన్‌), లియోనెల్‌ మెస్సీ(184 మిలియన్‌), నేమార్‌(147 మిలియన్‌) తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న క్రీడా సెలెబ్రిటీ విరాట్‌ కోహ్లీనే కావడం విశేషం. విరాట్‌కు ఇప్పటికే ఫేస్‌బుక్‌లో 36 మిలియన్లు, ట్విటర్‌లో 40.8 మిలియన్‌ ఫాలోవర్లు ఉన్నారు.

ఈ నెల మార్చి ఒకటో తేదీ నాటికి ప్రియాంక చోప్రాకు 60 మిలియన్లకు పైగా, దీపికా పదుకునేకు 53.3 మిలియన్ల మంది ఫాలోవర్లు, ప్రధాని నరేంద్రమోదీకి 51.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవలే దేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీల జాబితాలో బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్‌, రణవీర్‌లను దాటేసిన కోహ్లీ అగ్రస్థానానికి చేరుకున్నాడు.
 
ఇదిలా ఉంటే విరాట్ కెప్టెన్సీలోని టీమిండియా గురువారం ఇంగ్లండ్‌తో జరగబోయే నాలుగో టెస్టుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు ఈ సిరీస్‌లో జరిగిన మూడు టెస్టుల్లో ఇండియా రెండు గెలవగా, ఇంగ్లండ్ ఒకటి గెలిచింది. కాగా నాలుగో టెస్టును కూడా కైవసం చేసుకుని గ్రాండ్‌గా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లోకి అడుగుపెడదామని టీమిండియా భావిస్తోంది. కాగా ఇంగ్లండ్ మాత్రం ఇండియాను ఎలాగైనా ఓడించి ముందుకెళ్లాలని భావిస్తోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: