ఇంటర్నెట్ డెస్క్: టీమిండియాపై విమర్శలు చేయడానికి పాక్ ఆటగాళ్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. టీమిండియా ఆటగాళ్లు కానీ, బీసీసీఐ కానీ ఎప్పుడు ఎలాంటి తప్పు చేస్తుందా, దానిపై నోటికొచ్చినట్లు విమర్శిద్దామా అని వేచి చూస్తుంటారు. పాకిస్తాన్ మాజీల నుంచి ప్రస్తుత ఆటగాళ్ల వరకు ఇందులో ఎవరూ తీసిపోరు. వీరిలో ఆ దేశ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కూడా ప్రముఖంగా ఉంటాడు. తాజాగా టీమిండియాపై అక్తర్ నోరు పారేసుకున్నాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మూడో టెస్టు నేపథ్యంలో టీమిండియా భయపడుతోందని, అందులకే ఇలా చేస్తోందంటూ విచిత్రమైన వ్యాఖ్యలు చేశాడు.

భారత్, ఇంగ్లాండ్ మధ్య ఇటీవల జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌ రెండు రోజుల్లోనే ముగిసిన విషయం తెలిసిందే. దీనిగురించి షోయబ్ అక్తర్ మాట్లాడుతూ.. ‘స్పిన్‌కి అతిగా అనుకూలించిన మొతేరా పిచ్‌పై రెండు జట్ల స్పిన్నర్లు వికెట్ల పండగ చేసుకున్నారు. ఎంతలా అంటే..? మ్యాచ్‌లో రెండు రోజుల్లోనే 30 వికెట్లు పడగా.. ఇందులో ఏకంగా 28 వికెట్లు స్పిన్నర్ల ఖాతాలో పడ్డాయి. భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్ 11, అశ్విన్ 7 వికెట్లు పడగొట్టారం’టూ విమర్శించాడు.

మొతెరా పిచ్‌పై వంటి పిచ్‌లపై టెస్టు మ్యాచ్‌లు ఆడాలంటే తాను వద్దనే చెబుతానని, పిచ్ నుంచి ఊహించని టర్న్ లభించిందని, అందుకే మ్యాచ్‌ రెండు రోజుల్లోనే ముగిసిందంటూ చెప్పాడు. ‘ఇలాంటి పిచ్‌లు టెస్టు క్రికెట్‌కి ఏమాత్రం మంచిది కాదు. నిజమే ఆతిథ్య జట్లు పిచ్‌లను తమకి అనుకూలంగా రూపొందిస్తూ ఉంటాయి. కానీ.. మొతెరా పిచ్‌ విషయంలో భారత్ మరీ అతిగా వ్యహరించింది.

ఒకవేళ ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు 400 పరుగులు చేసి.. ఇంగ్లాండ్ 200 స్కోరుకే ఆలౌట్ అయ్యి ఉంటే..? అప్పుడు ఇంగ్లాండ్ టీమ్ సరిగా స్పిన్‌లో ఆడలేదని చెప్పి ఉంచొచ్చు. కానీ.. భారత్ జట్టు కూడా 145 పరుగులకే ఆలౌటైంది కదా..? భారత్ మంచి పిచ్‌లను తయారు చేసి నిజాయితీగా ఆడాలి. అలాంటి పిచ్‌లపై కూడా ఇంగ్లాండ్‌ని ఓడించే సామర్థ్యం భారత్‌కి ఉందని అనుకుంటున్నా,. మరి భారత్‌ మాత్రం ఇంకా భయపడుతోంది. ఆ భయం ఎందుకో అర్థం కావడం లేదు..? ఆ భయాన్ని పక్కనపెట్టి మంచి పిచ్‌లపై ఆడాలం’టూ అక్తర్ వ్యాఖ్యానించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: