ప్రస్తుతం టీమిండియా లో యువ సంచలనం రిషబ్ పంత్ భీకర ఫామ్ లో ఉన్నాడు. గత ఆస్ట్రేలియా పర్యటన మొదలుకొని తాజాగా ఇంగ్లాండ్ తో జరుగుతున్నా టెస్ట్ సిరీస్ లో కూడా తన ఫామ్ కొనసాగిస్తూనే ఉన్నాడు. కీలక సమయాల్లో అద్బుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ప్రత్యర్ధి బౌలర్ల పాలిట సింహస్వప్నంలా మారుతున్నాడు ఈ డాషింగ్‌ వికెట్‌కీపర్.‌ తాజాగా అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ సెంచ‌రీతో వీర విహారం చేశాడు. 116 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో టెస్టుల్లో మూడో సెంచ‌రీని నమోదు చేశాడు. రూట్‌ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి మ‌రీ సెంచ‌రీ పూర్తి చేసిన పంత్‌.. ఆ వెంటనే (101 పరుగుల వద్ద) అండర్సన్‌ బౌలింగలో ఔటయ్యాడు.

 పంత్ కు తోడు వాషింగ్టన్ సుందర్ అద్బుతమైన సహకారం అందిస్తూ 117 బంతుల్లో 60 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మొత్తానికి పంత్, సుందర్ లు కలిసి 113 ప‌రుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.దీంతో  టీమిండియా కీల‌క‌మైన తొలి ఇన్నింగ్స్ లో 89 పరుగుల ఆధిక్యం సంపాదించింది కీలకమైన సమయంలో సెంచరీతో చెలరేగిన పంత్ పై మాజీ ఆటగాళ్లు ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. 

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ట్విట్టర్ లో స్పందిస్తూ.. " ఒత్తిడిలో నమ్మశక్యంకాని రీతితో బౌలర్లపై విరుచుకుపడి అద్భుతమైన శతకం సాధించిన టీమిండియా డాషింగ్‌ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌కు అభినందనలు. నీ విధ్వంసం మొదటిది కాదు.. అలాగని ఆఖరిది కూడా కాకూడదు.. భవిష్యత్తులో నీ బ్యాటింగ్‌ ఊచకోత కొనసాగించాలని ఆశిస్తున్నా.." అంటూ పేర్కొన్నాడు. అలాగే మాజీ స్టైలిష్ బ్యాట్స్ మెన్ వివిఎస్ లక్ష్మణ్ స్పందిస్తూ.."యువ క్రికెటర్లు జట్టు బాధ్యతలను భుజానికెత్తుకోవడం సంతోషాన్ని కలిగిస్తోంది.. పంత్‌ ఊచకోత, సుందర్‌ నిలకడ ప్రదర్శనకు అభినందనలు" అంటూ తెలిపాడు. ఇక మాజీ డాషింగ్ బ్యాట్స్ మెన్ వీరేందర్ సెహ్వాగ్ స్పందిస్తూ "ఆండర్సన్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌ చేసి ఫోర్‌ కొట్టడం, సిక్సర్‌తో శతకాన్ని చేరుకోవడం అత్యద్భుతం..నువ్వే నా నిజమైన వారసుడివి.." అంటూ ట్విటర్ లో రాసుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: