ఇంటర్నెట్ డెస్క్: ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ తండ్రి టీమిండియా టెయిలెండర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బౌలర్లు కనీస ధైర్యం కూడా ప్రదర్శించలేదని విమర్శించారు. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ 96 పరుగులతో సెంచరీ మిస్ చేసుకున్న విషయం తెలిసిందే. జట్టు ఆలౌట్ కావడంతో నాటౌట్‌గా ఉన్నప్పటికీ అతడు సెంచరీ పూర్తి కాలేదు. ఇంతకుముందు కూడా తొలి టెస్టులో ఇలానే 85 పరుగుల దూరంలో సెంచరీని సుందర్ మిస్ చేసుకున్నాడు. ఈ విధంగా అతడి సెంచరీలు మిస్ కావడంపై సుందర్ తండ్రి ఎం సుందర్ స్పందించారు.

టెస్టుల్లో తన కొడుకు తొలి సెంచరీ అందుకోలేకపోవడం బాధకలిగించిందని, టెయిలెండర్ల ఆటతీరు పూర్తి స్థాయిలో నిరాశ కలిగించిందని అన్నారు. కనీసం కొన్ని నిముషాలు కూడా క్రీజులో నిలబడలేకపోవడం ఆశ్చర్యంతో పాటు ఆందోళన కూడా కలిగించిందన్నారు. ‘ఒకవేళ టీమిండియా గెలుపునకు మరో 10 పరుగుల దూరంలో ఉండి.. ఇలానే జరిగితే అది ఎంత పెద్ద తప్పో వేరే చెప్పాల్సిన పనిలేదు. దేశంలో కోట్లమంది మ్యాచ్ చూస్తుంటారు. ఇలా ఆడిన టెయిలెండర్ల నుంచి వారు నేర్చుకోకూడదు. అయితే నాకు తెలిసి అది బ్యాటింగ్ టెక్నిక్‌ తెలియక జరిగిన తప్పు కాదు. వారిలో ధైర్యం కరువవ్వడం వల్లనే ఇలా జరిగిందని భావిస్తున్నా’ అంటూ ఎం సుందర్ పేర్కొన్నారు.

ఇంగ్లండ్ బౌలర్లు పూర్తిగా అలసిపోయి ఉన్నారని, స్టోక్స్ కేవలం 123-126 వేగంలో మాత్రమే బంతులు విసురుతున్నాడని, అవేమీ ఎదుర్కోలేని వేగంతో దూసుకురావని, వాటిని కూడా ఎదుర్కోలేకపోవడం కొంత బాధించిందని సుందర్ పేర్కొన్నారు. అయితే తన కొడుకు గొప్పగా బ్యాటింగ్ చేయడంపై అందరూ ఆశ్చర్యంగా మాట్లాడుతున్నారని, అందులో కొత్తేమీ లేదని, అతడు ఎక్కడైనా బ్యాటింగ్ చేసే సత్తా ఉన్న ఆటగాడని సుందర్ చెప్పారు. తన కొడుకు కొత్త బంతిని సైతం దీటుగా ఎదుర్కోగల బ్యాట్స్‌మన్ అని, అయితే అవసరాల దృష్ట్యా అతడిని ఎలా వినియోగించుకోవాలనేది జట్టు నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, అందుకే అతడు చివర్లో బ్యాటింగ్‌కు దిగుతున్నాడని చెప్పుకొచ్చారు.

కాగా.. సుందర్ బ్యాటింగ్‌పై టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. సుందర్ బ్యాటింగ్ తనకు ఆశ్చర్యం కలిగించలేదని, అతడు బ్యాటింగ్‌పై చాలా కష్టపడతాడని, దాని ఫలితంగానే గొప్ప ఇన్నింగ్స్ ఆడగలుగుతున్నాడని చెప్పాడు. అతడికి బ్యాటింగ్ అంటే చాలా ఇష్టమని, అందుకే పట్టుదలగా ప్రాక్టీస్ చేస్తాడని చెప్పుకొచ్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: