ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. ప్రత్యర్థి ఎవరైనా అనవసరం.. విజయం ఒక్కటే మా గమ్యం అనేలా సిరీస్‌లు గెలుచుకుంటూ పోతోంది. ఎన్నో రికార్డులనూ సొంతం చేసుకుంటోంది. ఇంగ్లండ్‌పై సిరీస్ గెలుపుతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా మరో పాయింట్ల పట్టికలోనూ టాప్ ప్లేస్‌ను సొంతం చేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ బోర్డు తాజాగా ప్రకటించిన అంతర్జాతీయ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంది. ఇప్పటివరకు టాప్ ప్లేస్‌లో ఉన్న న్యూజిల్యాండ్‌ను వెనక్కి తోసి మరీ టాప్ ప్లేస్‌ను సొంతం చేసుకుంది.

ఇంగ్లండ్‌-టీమిండియా మధ్య మొతేరా స్టేడియంలో జరిగిన నాలుగో టెస్టులో భారత్ ఏకంగా ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ తరువాత ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. దీని ప్రకారం.. టీమిండియా 122 పాయింట్లతో టాప్ ర్యాంకుకు చేరింది. ఆ తరువాత న్యూజిల్యాండ్ 118 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. 113 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో ర్యాంకులో నిలిచింది. ఇండియా చేతిలో 3-1తో ఓటమిపాలైన ఇంగ్లండ్ 105 పాయింట్లతో నాలుగో స్థానానికి పరిమితమైంది. దాయాది దేశం పాకిస్తాన్ 90 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది.

ఆరో స్థానంలో 89 పాయింట్లతో సౌత్ ఆఫ్రికా, ఏడో స్థానంలో 83 పాయింట్లతో శ్రీలంక, ఏనిమితో స్థానంలో 80 పాయింట్లతో వెస్టిండీస్, తొమ్మిదో స్థానంలో 57 పాయింట్లతో ఆఫ్ఘనిస్తాన్, పదో స్థానంలో 51 పాయింట్లతో బంగ్లాదేశ్ ఉంది. విచిత్రం ఏమంటే ఈ మధ్యనే టెస్టుల్లోకి అడుగుపెట్టిన ఆఫ్ఘనిస్తాన్‌కంటే బంగ్లాదేశ్ కిందకు దిగి పదో స్థానంతో సరిపెట్టుకుంది.

ఇదిలా ఉంటే మరికొద్ది రోజుల్లో ఇంగ్లండ్‌, ఇండియా మధ్య టీ20 సిరీస్ జరగనుంది. ఈ మ్యాచ్‌లన్నీ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే జరగనున్నాయి. ఈ సిరీస్‌లో మొత్తం 5 మ్యాచ్‌లలో ఇరు జట్లు పోటీ పడనున్నాయి. ఈ సిరీస్ తరువాత 3 వన్డేల సిరీస్ కూడా జరగనుంది. మరి ఈ సిరీస్‌లను కూడా కైవసం చేసుకుని టీమిండియా తన జైత్రయాత్రకు తిరుగులేదని నిరూపిస్తుందో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: