ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్‌కు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇలాగే విఫలమైతే జట్టులో స్థానం కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. ‘నీ బ్యాటింగ్‌ను త్వరలో మార్చుకో. లేకపోతే జట్టులో స్థానం కోల్పోతావు. వాళ్లిద్దరూ వెయిట్ చేస్తున్నారు’ అంటూ వీవీఎస్ లక్ష్మణ్ హెచ్చరించాడు. ఇప్పటికే విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద పారిస్తున్న పృధ్వీషా, చక్కటి బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్న మయాంక్ అగర్వాల్‌లను గుర్తుచేస్తూ వీవీఎస్ లక్ష్మణ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఆసీస్ టూర్‌లో బోర్డర్, గవాస్కర్ ట్రోఫీకి ఎంపికైనా మయాంక్, పృధ్వీషాలు అంతగా ఆకట్టుకోలేదు. అయితే అదే సిరీస్‌లో గిల్ అద్భుతంగా రాణించారు. దీంతో వారిద్దరినీ జట్టులో నుంచి తొలగించినప్పటికీ.. గిల్‌ను మాత్రం ఇంగ్లండ్ సిరీస్‌కు ఎంపిక చేశారు. అయితే గిల్ ఈ సిరీస్ మొత్తం ఒక్కసారి కూడా చెప్పుకొదగిన ప్రదర్శన చేయలేదు. అయితే ప్రస్తుతం వజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్న మయాంక్, పృధ్వీషాలు దుమ్ము రేపుతున్నారు. పృధ్వీషా ఏకంగా రికార్డు డబుల్ సెంచరీతో అదరగొట్టగా, మయాంక్ సెంచరీలతో రాణిస్తున్నాడు. దీంతో జట్టులో గిల్ స్థానం ప్రమాదంలో పడింది. ఈ క్రమంలోనే లక్ష్మణ్ ఈ హెచ్చరికలు చేశాడు.

ఇదిలా ఉంటే ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 29 పరుగులు చేసిన గిల్, రెండో ఇన్నింగ్స్‌లో అర్థ సెంచరీ చేశాడు. కానీ ఆ తర్వాత అతడి వైఫల్యం మొదలైంది. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుతిరగడమే కాకుండా.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా 14 పరుగులకే అవుటయ్యాడు. ఇక మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 11 పరుగులకు, రెండో ఇన్నింగ్స్‌లో 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో మళ్లీ డకౌట్‌గా మూడో బంతికే అవుటయ్యాడు. దీంతో అతడి ఆటతీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: