ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా ఆటగాళ్ల ఫిట్‌నెస్ స్థాయిలను మరింత పెంచేందుకు బీసీసీఐ నిర్ణయించింది. దీనికోసం ఓ సరికొత్త ఫిట్‌నెస్ టెస్ట్‌ను ప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని బీసీసీఐ స్వయంగా ప్రకటించింది. యోయో టెస్ట్‌కు ఈ టెస్ట్ అదనమేనని, ప్రత్యామ్నాయం కాదని తెలిపింద. ఈ టెస్టులో ఆటగాళ్లు అదనంగా 2 కిలోమీటర్ల దూరాన్ని నిర్ణీత సమయంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ దూరాన్ని పేస్ బౌలర్లు 8 నిముషాల 15 సెకండ్లలో పూర్తి చేయాల్సి ఉంటుందని, అదే సమయంలో బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్ 8 నిముషాల 30 సెకండ్‌లలో పూర్తి చేయాల్సి ఉంటుందని వెల్లడించింది.   

యో-యో టెస్టు పూర్తి చేసిన ఆటగాళ్లు ఇక నుంచి ఈ టెస్టును కూడా పూర్తి చేయాలని, అప్పుడే టీమిండియాలో చోటు లభిస్తుందని బీసీసీఐ అధికారులు చెప్పారు. ఇప్పటికే యో-యో టెస్టు వల్ల భారత ఆటగాళ్ల ఫిట్‌నెస్ అద్భుతంగా ఉందని, ప్రపంచ క్రికెటర్లలో మేటి ఆటగాళ్లుగా తయారయ్యారని, మైదానంలో వారి ఫిట్‌నెస్ అద్భుతంగా ఉందని వారు చెబుతున్నారు. అయితే తాజాగా ప్రవేశపెట్టిన కొత్త టెస్టుతో వారి ఫిట్‌నెస్ మరింత పెరుగుతుందని, మైదానంలో చిరుతల్లా కదులుతారని బీసీసీఐ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
   
ఈ కొత్త టెస్టుకు సంబంధించి బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఇప్పటివరకు అమలులో ఉన్న టీమిండియా ఆటగాళ్ల ఫిట్‌నెస్ స్టాండర్డ్స్ అద్భుతంగా ఉన్నాయన్నారు. ‘ఈ స్టాండర్డ్స్‌తో మన ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు. మైదానంలో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అయతే ఇప్పుడు దీనిని మరింత పెంచాల్సిన అవరసం ఏర్పడుతోంది. అందుకే ఈ కొత్త టెస్టును ప్రవేశపెట్టాం. నిర్ణీత సమయంలో పూర్తి చేయాల్సిన ఈ టెస్ట్ వల్ల వారి శక్తి సామర్థ్యాలు మరింత పెరుగుతుతాయ’ని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఇకమీదట ప్రతి ఏడాది ఈ నిబంధనల్లో మరింత మార్పులు చేసే దిశగా బోర్డు ఆలోచిస్తోందని ఆ అధికారి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: