ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-2021 తొలి మ్యాచ్‌ ఎంతో ఉత్కంఠగా సాగింది. ఇరు జట్లు నువ్వా నేనా అన్న స్థాయిలో రాణించాయి. ముంబై జట్టు ఇచ్చిన లక్ష్యాన్ని ఛేదించి ఈ సీజన్‌ మొదటి విజయాన్ని ఆర్‌సీబీ తన ఖాతాలో వేసుకుంది. అయితే ఆర్‌సీబీ అందుకున్న ఈ విజయంలో బౌలర్ హర్షల్ పటేల్ పాత్ర చాలా కీలకమనే చెప్పాలి. సీజన్ తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థులకు పీడకళగా మారాడు. దాంతో మ్యాచ్ ముగిసిన అనంతరం కెప్టెన్‌ కోహ్లీ హర్షల్‌ పటేల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. అంతేకాకుండా హర్షల్ సీజన్‌ మొత్తం డెత్‌ ఓవర్‌ బౌలర్‌గా కొనసాగిస్తామని చెప్పాడు.

‘‘ఢిల్లీ జట్టు రిలీజ్ చేయడంతో హర్షల్‌ను మేం సొంతం చేసుకున్నాం. అతడిపై జట్టు పెట్టుకున్న నమ్మకాన్ని తనదైన ప్రణాళికలతో నిలుపుకొన్నాడు. ఈ మ్యాచ్‌లో అతడి ఆట తీరు కూడా ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. మైదానంలో అభిమానులు ఉండుంటే అతడు చేసిన ప్రదర్శనకు వారి హర్షధ్వారాలతో స్టేడియం దద్దరిల్లిపోయేది. ఇక నుంచి డెత్‌ ఓవర్లలో అతడి సేవలు పూర్తిగా వినియోగించుకుంటాం. నా అంచనాలను మించిన ప్రతిభతో అదరగొట్టాడ’’ని కోహ్లీ హర్షల్ పటేల్‌ను ఆకాశానికెత్తేశాడు. ఇతర ఆటగాళ్లు కూడా చక్కగా రాణించారని కోహ్లీ పేర్కొన్నాడు.

జేమీసన్‌, యజువేంద్ర చహల్‌, మహ్మద్‌ సిరాజ్‌ మ్యాచ్‌కు శుభారంభం అందించారని, విజయాన్ని  చేశారని కోహ్లి పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఆర్సీబీ ఫాస్ట్‌ బౌలర్‌ హర్షల్‌ పటేల్‌ తనదైన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి జట్టులోని కీలక ఆటగాళ్లను పెవిలియన్‌ బాట పట్టించాడు. తన ప్రతిభకు  తద్వారా మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన హర్షల్‌ ఆర్సీబీ అభిమానుల చేత ప్రశంసలు అందుకుంటున్నాడు.

కాగా.. ఐపీఎల్ 2021లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. తక్కువ స్కోర్లే నమోదైనా.. ఇరు జట్లు బౌలర్లూ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో చివరి బంతి వరకు మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది. అయితే ఆఖరి బంతికి ఆర్సీబీ ఎలాగోలా విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: