ఐపీఎల్ 14వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరబాద్ వరుసగా రెండవ ఓటమిని ఖాతాలో వేసుకుంది. నిన్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్ లో 6 పరుగుల తేడాతో ఓటమి మూటగట్టుకుంది. ఆర్సీబీ నిర్దేశించిన 149 పరుగుల లక్ష్యాన్ని కూడా చేధించలేక చతికిల పడింది. అయితే జట్టు గెలవాల్సిన మ్యాచ్ లలో కూడా ఓటమి చవి చూస్తుండడంతో సన్ రైజర్స్ అభిమానులు తీవ్ర అసహనంగా ఉన్నారు. అయితే జట్టు టాప్ ఆర్డర్ బలంగా ఉన్నప్పటికి మిడిలార్డర్ బలహీనంగా ఉండడంతో జట్టు విజయాలకు దూరమవుతుందని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

మిడిలార్డర్ లో విలియమ్సన్ ఉంటే జట్టు వైఫల్యాలను ఎదుర్కొనేది కాదని ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్ చెబుతున్నారు.  విలియమ్సన్‌ను గత రెండు మ్యాచ్ లలో తుది జట్టులోకి ఎంపిక చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొలి మ్యాచ్‌లో మహ్మద్‌ నబీ, రెండో మ్యాచ్‌లో జేసన్‌ హోల్డర్‌కు అవకాశం కల్పించిన మేనేజ్‌మెంట్‌కు మ్యాచ్‌ విన్నర్‌ అయిన విలియమ్సన్‌ ఎందుకు పక్కన పెడుతున్నారంటూ అభిమానులు నిలదీస్తున్నారు.

 ఈ నేపథ్యంలో తుది జట్టులో విలియమ్సన్‌ను ఎంపిక చేయకపోడంపై ఆ జట్టు కోచ్‌ ట్రెవర్‌ బేలిస్‌ స్పందించాడు. జట్టు కూర్పు విషయంలో ఎటువంటి సమస్య లేదని, విలియమ్సన్‌ పూర్తి స్థాయిలో ఫిట్‌గా లేకపోడంవల్లనే అతన్ని తుది జట్టులోకి తీసుకోవట్లేదని క్లారిటీ ఇచ్చాడు. ఫిట్‌నెస్‌ విషయంలో విలియమ్సన్‌ కసరత్తు చేస్తున్నాడని, అతను పూర్తిగా కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని వివరణ ఇచ్చాడు. మరి విలియమ్సన్ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి శనివారం ముంబై తో జరగబోయే మ్యాచ్ కైనా విలియమ్సన్ ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ముంబై లాంటి బలమైన జట్టును ఎదుర్కోవాలంటే ఎస్‌ఆర్‌హెచ్ లో నాణ్యమైన ఆటగాళ్లు ఉండడం చాలా అవసరం. ఈ క్రమం లోనే ముంబై తో జరిగే పోరులో తుది జట్టులో విలియమ్సన్ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: