ఇంటర్నెట్ డెస్క్: మహేంద్ర సింగ్ ధోనీ. ఈ పేరు గురించి క్రికెట్ ప్రపంచానికి కొత్తగా ఏమీ చెప్పాల్సిన పనిలేదు. ధోనీ ఎలాంటి ఆటగాడు, క్రికెట్‌లో అతడికున్న అనుభవం ఎలాంటిదనే విషయాల గురించి చర్చే అవసరం లేదు. టీమిండియాను అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్‌గా నిలపడమే కాకుండా మూడు ఐసీసీ ట్రోఫీలను సైతం దేశానికి అందించి అపార అనుభవం కలిగిన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు. 2020లో జాతీయ జట్టుకు రిటైర్మెంట్ ప్రకటించి ఐపీఎల్‌ మాత్రం ఆడుతున్నాడు. ఈ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా కూడా ఎన్నో గొప్ప విజయాలు సాధించాడు. 3 సార్లు జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. ఈ క్రమంలోనే ఎంతో మంది యువ ఆటగాళ్లకు మార్గదర్శనం చేశాడు. వారిని అద్భుతమైన ఆటగాళ్లుగా తీర్చి దిద్దాడు. అంతేకాదు.. ఆ ఆటగాడు తన సొంత జట్టు ఆటగాడా..? లేక ప్రత్యర్థి ఆటగాడా..? అనే విషయం కూడా ధోనీ పట్టించుకోడు. తనవద్దకు వచ్చిన ప్రతి ఆటగాడికీ సలహాలిస్తూ వారి ఆటను మెరుగుపర్చుకునేందుకు సూచనలందిస్తుంటాడు. తాజాగా పంజాబ్‌తో మ్యాచ్ తరువాత కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఐపీఎల్‌-2021లో భాగంగా, శుక్రవారం నాటి మ్యాచ్‌ అనంతరం పంజాబ్‌ కింగ్స్‌ ఆటగాడు షారుఖ్‌ ఖాన్‌కు ఈ అవకాశం దక్కింది. ఈ మ్యాచ్‌లో చెన్నై ఆరు వికెట్ల తేడాతో పంజాబ్‌పై గెలుపొందిన సంగతి తెలిసిందే. సీఎస్‌కే బౌలర్‌ దీపక్‌ చహర్‌ ధాటికి తమ టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టినా షారుఖ్‌ ధైర్యంగా నిలబడి, 47 పరుగుల(36 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు)తో రాణించాడు. తమ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టు మొయీన్ అలీ, ఫాఫ్ డూ ప్లెసిస్ నిలకడైన ఆటతో సునాయాసంగా విజయం సాధించింది. ఐపీఎల్‌లో 200వ మ్యాచ్ ఆడుతున్న ధోనీ.. ఈ విజయంతో మరపురాని విజయాన్ని కైవసం చేసుకున్నాడు. కాగా.. మ్యాచ్ ముగిసిన తరువాత చెన్నై డగౌట్‌లో కూర్చుని ఉన్న ధోనీ వద్దకు పంజాబ్ షారూఖ్ ఖాన్ వచ్చాడు. బ్యాటింగ్‌కు సంబంధించి కొన్ని సందేహాలను వెలిబుచ్చాడు. అతడు ప్రత్యర్థి జట్టు ఆటగాడైనా.. ధోనీ అతడితో చాలా సేపు మాట్లాడాడు. బ్యాటింగ్ మెరుగుపరుచుకునేందుకు అవసరమైన సలహాలు, సూచనలు అందించాడు.

ఇందుకు సంబంధించిన ఫొటోను సీఎస్‌కే సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ‘ఒకరు ఫినిషర్‌.. మరొకరు అదే బాటలో ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న ఆటగాడు’ అంటూ ఆ ఫోటోకు క్యాప్షన్ రాసుకొచ్చింది. కాగా.. అనేకమంది క్రికెట్ అభిమానులు ఈ ఫోటోపై రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఐపీఎల్‌ యాజమాన్యం సైతం ఈ ఫోటోపై స్పందించింది. ‘‘బ్యూటీ ఆఫ్‌ ఐపీఎల్‌’’ అని కామెంట్‌ చేసింది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ధోని ఫ్యాన్స్‌ను విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్‌కు సలహాలు ఇస్తున్న విధానానికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. ‘‘దటీజ్‌ ధోని’’ అంటూ ధోనీని ఆకాశానికెత్తేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: