ఇంటర్నెట్ డెస్క్: ఇంతకుముందు ఐపీఎల్ సీజన్లతో పోల్చితే ఈ ఏడాది సీజన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు బాగా కలిసొస్తోంది. వరుసగా తొలి రెండు మ్యాచ్‌లను గెలిచి ఫుల్ జోష్ మీదుంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను మట్టి కరిపించి, ఆ తర్వాత మ్యాచ్‌లో టోర్నీ హాట్ ఫేవరెట్ సన్‌రైజర్స్‌ను బోల్తా కొట్టించి వరుస విజయాలను నమోదు చేసింది. ఈ క్రమంలోనే ఆ జట్టు ఆటగాళ్లు విజయపు ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఫుల్ పార్టీ మూడ్‌లో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్సీబీ జట్టు ఆటగాళ్లంతా శుక్రవారం సప్పర్ థియేటర్ గేమ్ ఆడాడు.

విరాట్‌ కోహ్లీ, డివిలియర్స్‌, యజ్వేంద్ర చహల్‌ మూడు జట్లకు నాయకత్వం వహించగా.. ఇతర ఆటగాళ్లు ఫుల్‌గా ఎంటర్‌టైన్‌ అందించారు. ముందు కోహ్లి అగ్లీ డక్లింగ్‌తో చిన్నపిల్లాడిలా మారిపోయి తన యాక్టింగ్‌తో ఇరగదీయగా.. డివిలియర్స్‌ సిండ్రిల్లా గేమ్‌ ఆడాడు. ఇక చాహల్‌.. కోహ్లీ, డివిలియర్స్‌ను అనుసరిస్తూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కాగా ఆర్‌సీబీ ఆటగాళ్లతో పాటు వారి కుటుంబ సభ్యులు, జట్టు యాజమాన్య సభ్యలు కూడా ఈ సరదా సాయంత్రంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఆర్‌సీబీ తన బోల్డ్‌ డైరీస్‌లో పంచుకుంది.

''ఇది కేవలం ఫన్‌ కోసం మాత్రం కాదు. దాదాపు 50 రోజులకు పైగా జట్టుగా కలిసి క్రికెట్‌ ఆడాల్సి వస్తుంది. మానసిక ఒత్తిడి దూరమయ్యేందుకు ఇలా చిన్ననాటి ఆటలను మరోసారి ఆడిపించాం. వాళ్లు ఎంత సరదాగా ఆడారో.. అంత ఎంటర్‌టైన్‌ అందించారు.'' అంటూ క్యాప్షన్‌ జత చేసింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గతేడాది సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తరపున దారుణంగా విఫలమైన ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ప్రస్తుతం ఆర్‌సీబీ తరపున మాత్రం అదరగొడుతున్నాడు. మొదటి మ్యాచ్‌లో 39 పరుగులు చేసిన అతను రెండో మ్యాచ్‌లో 59 పరుగులతో విజయంలో కీలకపాత్ర పోషించాడు.

కాగా.. ముంబై, ఎస్‌ఆర్‌హెచ్‌లపై విజయంతో జోష్ మీదున్న ఆర్సీబీ.. ఆదివారం.. కేకేఆర్‌తో మూడో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. ఇప్పటికే ముంబైతో మ్యాచ్‌లలో ఓడిన కేకేఆర్.. ఈ మ్యాచ్‌లో గెలవాలని పట్టుదలగా ఉంది. అయితే ఆర్సీబీ మాత్రం ఎలాగైనా ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి టేబుల్ టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకోవాలని భావిస్తోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: