ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 14వ సీజన్లో వరుసగా మూడో ఓటమిని సన్‌రైజర్స్ హైదరాబాద్ చవిచూసింది. శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి గెలుపు అంచుల నుంచి ఓటమిపాలైంది. దీంతో సన్‌రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఎలాంటి అనుభవం లేని నలుగురు యువ ఆటగాళ్లను జట్టులోకి ఒకేసారి తీసుకుని ముంబైలాంటి పటిష్ఠ జట్టుపై గెలవాలనుకోవడం నిజంగా తెలివితక్కువ తననమేనని క్రికెట్ విమర్శకులతో పాటు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే సన్‌రైజర్స్ కీలక బ్యాట్స్‌మన్, కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ప్రస్తావన వస్తోంది. అతడు జట్టులోకి వస్తే కానీ ఎస్‌ఆర్‌హెచ్ విజయం రుచి చూడలేదని అనేకమంది అభిప్రాయపడుతున్నారు. అయితే మూడో మ్యాచ్ ప్రారంభంలోనే విలియమ్సన్‌ గురించిన కొంత సమాచారాన్ని ఎస్‌ఆర్‌హెచ్ జట్టు యాజమన్యం బయటపెట్టింది.

విలియమ్సన్‌ ఇంకా పూర్తిగా ఫిట్‌గా లేడని, అందుచేత అతన్ని జట్టులో వేసుకోలేదని ఫ్రాంచైజీ వివరణ ఇచ్చింది. ఈ విషయాన్ని కేన్‌ విలియమ్సన్‌ స్వయంగా స్పష్టం చేసిన ఓ వీడియోను కూడా విడుదల చేసింది. 'గాయం నయమవుతోంది. వారం రోజుల్లో పూర్తి ఫిట్‌నెస్ సాధించి బరిలోకి దిగుతా.  ప్రాక్టీస్‌కు బ్యాలెన్స్ పాటిస్తున్నా. అతి తర్వలోనే పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌తో సిద్ధమవుతా’ అంటూ ఆ వీడియోలో విలియమ్సన్ తెలిపాడు. ఈ క్రమంలోనే ముంబైతో మ్యాచ్‌కు కూడా విలియమ్సన్‌ తీసుకోవడం లేదని తెలిపింది. ఇది అభిమానుల్లో ఆందోళన కలిగించింది. ఇలా అయితే ఈ మ్యాచ్ కూడా ఎస్‌ఆర్‌హెచ్ ఓడిపోతుందని అనేకమంది అంచనాలు కూడా వేశారు. వారి అంచనాల ప్రకారమే మిడిలార్డర్ దారుణ వైఫల్యంతో ఎస్‌ఆర్‌హెచ్ వరుసగా మూడోసారి ఓటమి చవి చూసింది.

కాగా.. 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రైజర్స్‌ మనీష్ పాండే(2), విరాట్ సింగ్(11), విజయ్ శంకర్(28), అభిషేక్ శర్మ(2), అబ్దుల్ సమద్(7), రషీద్ ఖాన్(0), భువనేశ్వర్ కుమార్(1), ఖలీల్ అహ్మద్(1) కనీసం రెండంకెల స్కోరు కూడా చేయకపోవడంతో సన్‌రైజర్స్‌కు ఓటమి తప్పలేదు. ఈ ఓటమితో టోర్నీలో వరుసగా మూడో ఓటమి ఖాతాలో వేసుకుంది. బెయిర్ స్టో, వరుస ఓవర్లలో వికెట్ల కోల్పోవడంతో 19.4 ఓవర్లలో 137 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. వార్నర్ తరువాత విజయ్ శంకర్(28) మాత్రమే కొద్దిగా పర్వాలేదనిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: