ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 14 సీజన్లో వరుస ఓటములతో అత్యంత దారుణంగా విఫలమవుతున్న జట్లలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఒకటి. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్ లలో సైతం అనూహ్యంగా బోల్తా కొట్టి ఓటమి పాలవుతోంది కేకేఆర్. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం తర్వాత మళ్లీ ఆ జట్టు ఒక్క విజయం కూడా సాధించలేదు. 2వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌‌పై ఆ జట్టు ఓటమి నిజంగా విచిత్రం. 15 ఓవర్ల వరకు పటిష్ఠ స్థితిలో ఉండి.. ఆ తర్వాత ఉన్నట్లుండి ఓటమి పాలైంది. ఇక మూడో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు‌పై కూడా గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడింది. ఈ క్రమంలోనే కేకేఆర్ జట్టుపై ఆ జట్టు మాజీ కెప్టెన్ గౌతం గంభీర్ తీవ్ర నిప్పులు చెరిగాడు. ఇలా ఆడితే ఇంటి ముఖం పెట్టె సమయం ఇంకెంతో దూరం లేదని ఎద్దేవా చేశాడు.

 కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ఆర్సీబీ చేతిలో ఓడిపోవడానికి చెత్త కెప్టెన్సీనే కారణమని గంభీర్ అభిప్రాయపడ్డాడు. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు.. ఓపెనింగ్ దెబ్బ తిన్నా మిడిల్ ఆర్డర్లో ఏబీ డివిలియర్స్ (76 నాటౌట్: 34 బంతుల్లో 9x4, 3x6), గ్లెన్ మాక్స్‌వెల్ (78: 49 బంతుల్లో 9x4, 3x6) చెలరేగడంతో భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. వీరిని ఆయాపడంలో కేకేఆర్ కెప్టెన్ మోర్గాన్ తో పాటు బౌలర్ల వల్ల కూడా కాలేదు

అనంతరం ఛేదనలో కోల్‌కతా మొదట్లో బాగా ఆడింది. కానీ మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ దారుణంగా విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. 166/8కే పరిమితమైంది. స్పిన్‌కి ఆరంభంలో పిచ్‌ అనుకూలించినట్లు కనిపించినా.. కోల్‌కతా కెప్టెన్ అనాలోచిత నిర్ణయాలతో జట్టు ఓటమికి కారణమయ్యాడని గౌతమ్ గంభీర్ విమర్శలు గుప్పించాడు.

 ఇన్నింగ్స్ ఆరంభంలో ఆర్సీబీ చాలా ఇబ్బంది పడింది. 2వ ఓవర్ వేసిన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి.. రెండో బంతికి ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(5: 6 బంతుల్లో 1x4) అవుట్ చేశాడని, విరాట్ చాలా పెద్ద వికెట్ అని, అంత పెద్ద వికెట్ కోల్పోయిన తర్వాత సాధారణంగా జట్టు ఒత్తిడిలోకి వెళుతుందని, ఆ ఓవర్లోనే ఆఖరి బంతికి రజత్ పాటిదార్(1: 2 బంతుల్లో)ల వికెట్ కూడా తీసి మరింత ఒత్తిడి పెంచాడు. జట్టుకు మంచి బూస్ట్ ఇచ్చాడు.

‘వరుణ్ చక్రవర్తిని ఎదుర్కోవదానికి బెంగళూరు చెమటోడ్చింది. కానీ అతనితో మళ్లీ 8వ ఓవర్ వరకూ ఇయాన్ మోర్గాన్ బౌలింగ్ చేయించలేదు. ఒకవేళ నాలుగో ఓవర్‌ని వరుణ్ చక్రవర్తి వేసి ఉంటే..? అతను మాక్స్‌వెల్ వికెట్ పడగొట్టేవాడని గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఒకవేళ మాక్స్‌వెల్ ఆరంభంలోనే ఔటై ఉంటే..? అప్పుడు ఏబీపై ఒత్తిడి పడేది. భారత్‌కి చెందిన ఏ కెప్టెన్ కూడా ఇంత చెత్త నిర్ణయం తీసుకోడు'' అని గంభీర్ అన్నాడు.

మోర్గాన్‌పై కెప్టెన్సీ భారత్ కు చెందిన యువ కెప్టెన్‌ల సారథ్యం కంటే దారుణంగా ఉందని విమరయించాడు. భారత్‌కు చెందిన ఏ కెప్టెన్ కూడా ఇలా చెత్త నిర్ణయం తీసుకోడని, ఒకవేళ తీసుకుంటే అతడిపై ఇప్పటికి ఎంతోమంది విరుచుకుపడేవారని అన్నాడు. కానీ మోర్గాన్ కనుక ఎవరూ పట్టించుకోవట్లేదని ఆరోపించాడు. 'ఓ బౌలర్ తన తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు తీసినా, అతడిని పక్కన పెట్టడం నిజంగా బుద్ధిలేని చర్య. ఇలాంటి చెత్త కెప్టెన్సీని నా జీవితంలో చూడలేదు. ఇలాంటి దారుణమైన కెప్టెన్సీతో ముందుకెళ్తే అతి త్వరలోనే కేకేఆర్ ఇంటి ముఖం పట్టడం ఖాయంగా కనిపిస్తోందని అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: