టోక్యో ఒలింపిక్స్‌లో మెడ‌ల్ గ్యారెంటీ అని గంపెడు ఆశలతో బ‌రిలోకి దిగిన భార‌త ఆర్చ‌ర్లు తొలి రోజు పోటీల్లో పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌తో నిరాశ‌ప‌ర్చారు. శుక్రవారం ముగిసిన మహిళల వ్యక్తిగత ర్యాంకింగ్‌ రౌండ్‌లో వ‌ర‌ల్డ్‌ నెంబర్ వన్‌ దీపికా కుమారి 663 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచింది. ద‌క్షిణ కొరియా ఆర్చ‌ర్‌ అన్‌ సాన్‌ ఏకంగా 680 పాయింట్లు స్కోరు చేసి విశ్వ‌క్రీడ‌ల్లో సరికొత్త రికార్డు నెల‌కొల్పింది. ఆ దేశానికే చెందిన జాంగ్‌ మిన్‌హి (677), కాంగ్‌ చే వాంగ్‌ (675) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ర్యాంకింగ్‌ రౌండ్లో వచ్చిన స్థానాలను బట్టి ఆర్చర్లకు ప్రధాన రౌండ్లలో సీడింగ్స్‌ కేటాయిస్తారు. దీనిబ‌ట్టి చూస్తే దీపికకు క్వార్టర్స్‌లో టాప్‌సీడ్‌ అన్‌ సాన్‌తో త‌ల‌ప‌డే అవకాశముంది. పురుషుల వ్యక్తిగత విభాగం క్వాలిఫికేష‌న్‌ రౌండ్లలో భార‌త‌ స్టార్‌ ఆర్చర్‌ అతాను దాసు 653 పాయింట్లతో 35వ స్థానానికి పరిమితమవగా, తరుణ్‌దీప్‌ (652) 37వ ప్లేస్‌లో నిలిచాడు. ఈ ఇరువురు కంటే కాస్త మెరుగైన ప్రదర్శన చేసిన మరో భార‌త ఆర్చర్‌ ప్రవీణ్‌ 656 పాయింట్లతో 31వ స్థానాన్ని దక్కించుకున్నాడు. దీపిక, ప్రవీణ్‌ పాయింట్లు కలిపితే మిక్స్‌డ్ కేట‌గిరీలో ఇండియాకు 9వ‌ స్థానం లభించింది. ఇక పురుషుల్లో ముగ్గురు ఆర్చర్ల పాయింట్ల ఆధారంగా టీమ్‌ ఈవెంట్లో భారతకు తొమ్మిదో స్థానం దక్కింది.

దీపిక భ‌ర్త స్థానంలో ప్రవీణ్‌
ముందుగా నిర్ణ‌యించిన‌ షెడ్యూల్‌ ప్రకారం ఇండియా తరఫున ఆర్చరీ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో భార్యాభర్తలు దీపికా కుమారి, అతాను దాస్‌ పోటీపడాలి. కానీ, ఇప్పుడు మిక్స్‌డ్‌లో దీపిక భాగస్వామిగా ప్రవీణ్‌ జాదవ్‌ను ఎంపిక చేసినట్టు భారత ఆర్చరీ సంఘం శుక్రవారం ప్రకటించింది. అర్హత ర్యాంకింగ్స్‌లో అతాను దాసు కంటే ప్రవీణ్‌ మెరుగైన ప్రదర్శన చేయడంతో ఆర్చరీ సంఘం ఈ అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. శ‌నివారం ఉదయం 6 గంటలకు మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌ ఎలిమినేషన పోటీల్లో దీపికా కుమారి-ప్రవీణ్‌ జాదవ్‌ జోడీ బ‌రిలోకి దిగ‌నున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: