ప్రపంచ ఆర్చరీ పోటీలు అమెరికాలో వేడుకగా జరుగుతున్నాయి. ఈ పోటీలలో తెలుగు తేజం వెన్నం జ్యోతి తన సత్తా చాటింది. దేశానికి రజతం సాధించి పెట్టింది. తాజాగా జరిగిన పోటీలో జ్యోతి సురేఖ మూడు రజతాలు గెలిచింది. జ్యోతి స్వర్ణం కోసమే పోరాడినప్పటికీ చివరి నిముషంలో తడబడి రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో ఈ విజయం సాధించింది. కొలంబియాకు చెందిన సారా లోపెజ్ తో స్వర్ణం కోసం పోటీపడిన జ్యోతి 144-146 పాయింట్లతో రజతం గెలిచింది. వీరిద్దరి మధ్య ఐదుసార్లు మూడు బాణాల చొప్పున మొత్తం 15సార్లు లక్ష్యాన్ని గురిపెట్టగా తొలి రౌండ్ లో సారా 29, జ్యోతి 28; రెండో రౌండ్ లో ఇద్దరు 29 చొప్పున; మూడో రౌండ్ లో సారా 30, జ్యోతి 29; నాలుగో రౌండ్ లో సారా 29, జ్యోతి 28; ఐదవ రౌండ్ లో సారా 29, జ్యోతి 30 పాయింట్లు పొందారు.

కేవలం రెండు పాయింట్ల తేడాతో సారా పసిడి గెలుచుకోగా, జ్యోతి రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సెమీ ఫైనల్స్ లో కూడా జ్యోతి 148-146 పాయింట్లతో కెనడాకు చెందిన ఆండ్రియా బేసెరా పై విజయం సాధించింది. గత పోటీలలో సారా లోపెజ్(2013), లిండా ఆండర్సన్ (అమెరికా, 2018) మాత్రమే 150 కి 150 పాయింట్లు సాధించారు. ఇక టీం విభాగం లో జ్యోతి, ముస్కాన్ కిరార్, ప్రియా గుర్జర్ తో కూడిన భారత జట్టు 224-229 పాయింట్లతో సారా లోపెజ్, అలెజాండ్రా, ఉస్కియానో, నోరా వాల్దేజ్ తో కూడిన కొలంబియా జట్టు చేతిలో ఓడి రజతాన్ని సొంతం చేసుకుంది.

ఇక మిక్స్డ్ ఫైనల్స్ లో జ్యోతి-అభిషేక్ వర్మ తో కూడిన భారత జంట 150-154 పాయింట్లతో  సారా లోపెజ్-డానియల్ మునోజ్ తో కూడిన కొలంబియా జంట చేతిలో ఓడి రజతం సొంతం చేసుకున్నారు. జ్యోతి ఆర్చరీ విజయాల పరంపరలో 2017లో టీం విభాగంలో రజతం, 2019లో టీం విభాగంలో కాంస్యం, 2021లో అన్ని విభాగాలలో కలిపి మూడు రజతాలు తెలిచింది. గత  పదేళ్ల అంతర్జాతీయ కెరీర్ లో జ్యోతి 41 పోటీలలో పాల్గొని 36 పతకాలు సాధించింది. ఇందులో తొమ్మిది స్వర్ణాలు, 16 రజతాలు, 11 కాంస్యాలు ఉన్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: