ఒక దేశంలో పుట్టిన ఆటగాడు.. మరో దేశం తరపున ప్రాతినిధ్యం వహించడం క్రికెట్‌లో సాధారణమే. కొందరు అయితే ఏకంగా కెప్టెన్లుగా కూడా ఆడారు. దక్షిణాఫ్రికాలో పుట్టిన కెవిన్ పీటర్సన్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్ గా కూడా పనిచేశాడు. ఇక ప్రపంచ కప్‌ను ఇంగ్లాండ్‌ కైవసం చేసుకోవడంలో కీలక భూమిక వహించిన బెన్ స్టోక్స్‌ది కూడా ఇంగ్లాండ్ కాదు. బెన్ స్టోక్స్‌ న్యూజిలాండ్‌లో జన్మించాడు. అలాగే ప్రపంచ కప్‌లో సూపర్‌ ఓవర్‌ వేసి అందరినీ ఆకట్టుకున్న జోఫ్రా ఆర్చర్‌ సైతం వలస క్రికెటరే. ఆర్చర్‌ది కరీబియన్‌ దీవుల్లోని బార్బడోస్‌. ఇక స్పిన్నర్‌లు మొయిన్‌ అలీ, ఆదిల్‌ రషీద్‌లు ఇంగ్లాండ్‌లోనే పుట్టినప్పటికీ.. వారి కుటుంబాలు పాకిస్థాన్‌ నుంచి వలస పోయాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. ఈసారి యూఏఈ వేదికగా జరిగే టీ20  వరల్డ్ కప్‌లో వివిధ దేశాల తరపున ఆడుతున్న భారత సంతతికి చెందిన క్రికెటర్లు ఉండటంపై క్రీడాభిమానుల్లో చర్చ జరుగుతోంది.

పొట్టి ప్రపంచ కప్పు కోసం మొత్తం 16 జట్లు పోటీ పడుతున్నాయి. ఐదుగురు భారత సంతతి క్రీడాకారులు వివిధ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భారత సంతతికి చెందిన సిమీ సింగ్‌.. ఐర్లాండ్ తరపున ఆల్‌రౌండర్‌గా ఆడుతున్నాడు. మంచి బ్యాటింగ్ తోపాటు ఆల్‌రౌండర్ ప్రతిభ కలిగిన సిమీసింగ్.. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో అదరగొట్టి ఐర్లాండ్ టీ20 జట్టులో స్థానం దక్కించుకున్నాడు. అలాగే  హైదరాబాద్‌కు చెందిన సందీప్ గౌడ్‌ మీడియం పేస్‌ బౌలర్‌ తోపాటు ఆల్‌రౌండర్‌ కూడా. సందీప్ గౌడ్‌ ఒమన్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.  15 టీ20 మ్యాచ్‌లు ఆడిన సందీప్ గౌడ్‌.. కెరీర్‌లో 48 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక పంజాబ్‌కు చెందిన సూరజ్ కుమార్ కూడా ఒమన్ దేశానికే ఆడుతున్నాడు. 32ఏళ్ల సూరజ్ కుమార్‌ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌. కెరీర్‌లో 17వన్డే మ్యాచ్‌లు, 16 టీ20లు ఆడాడు. వన్డేలలో 302 రన్స్.. టీ20ల్లో 105 రన్స్ చేశాడు.

భారత సంతతికే చెందిన ఈష్ సోధీ న్యూజిలాండ్ జట్టు తరపున ఆడుతున్నాడు. గత టీ20 వరల్డ్ కప్‌లో సోధీ తన లెగ్ స్పిన్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్‌కి 57 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈష్‌ సోధీ.. 21.73 సగటుతో 73 వికెట్లు పడగొట్టాడు. మరో భారత సంతతి క్రికెటర్ జితేందర్ సింగ్ ఒమన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కుడి చేతి వాటం బ్యాట్స్‌మన్ అయిన జితేందర్ సింగ్ 19వన్డే మ్యాచ్ లతో పాటు 28 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 24.11 సగటుతో వన్డేల్లో 434 పరుగులు సాధించాడు. 27.88 సగటుతో టీ20ల్లో 697 రన్స్ జితేందర్ సింగ్ ఖాతాలో ఉన్నాయి.
మొత్తంమీద ఈసారి యూఏఈ వేదికగా జరుగుతున్న టీ-20 వరల్డ్‌కప్‌లో భారత సంతతికి చెందిన ఐదుగురు ఆటగాళ్లు ఉంటడం ప్రత్యేకత సంతరించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: