ఐసిసి టీ 20 ప్రపంచకప్ లో ఈరోజు మొదటి మ్యాచ్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన విషయం తెలిసిందే, అయితే ఈ మ్యాచ్ లో 119 పరుగుల స్వల్ప లక్ష్యంతో వచ్చిన ఆసీస్ జట్టు దానిని చేధించడానికి చాలా కష్టపడింది. అయితే మొదట ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఐదు బంతులను ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయకుండా ఔట్ కాగా... ఆ తర్వాత మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 15 బంతుల్లో 14 పరుగులు చేసి అవుటయ్యాడు. అలాగే మిచెల్ మార్ష్ 17 బంతుల్లో కేవలం 11 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. దాంతో 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది ఆసీస్. కానీ ఆ తర్వాత ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ 34 బంతుల్లో 35 పరుగులు చేసి జట్టును లక్ష్యం వైపు నడిపించాడు. అలాగే గ్లెన్ మాక్స్ వెల్ 21 బంతుల్లో 18 పరుగులు చేయగా చివర్లో మార్కస్ స్టోయినిస్ 16 బంతుల్లో 24 పరుగులు చేశాడు. అలాగే వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ 10 బంతుల్లో 15 పరుగులు చేయడంతో ఆసీస్ జట్టు ఐదు వికెట్లను కోల్పోయి 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి ఈ ప్రపంచ కప్ లో మొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

సౌతాఫ్రికా బౌలర్లలో అన్రిచ్ నోర్ట్జే రెండు వికెట్లు తీయగా... కగిసో రబాడా, కేశవ మహారాజ్, తబరైజ్ షమ్సీ ఒక్కో వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టులో మార్క్రం ఒక్కడే 40 పరుగులతో రాణించారు. దాంతో ఆ జట్టు 9 వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో కేవలం 118 పరుగులు చేయగలిగింది. దానిని ఆ జట్టు బౌలర్లు కాపాడే ప్రయత్నం చేసిన ఫలించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: