కాన్పూర్‌లో భారత రికార్డు సేఫ్‌గా ఉంది. 38 ఏళ్లుగా కాన్పూర్‌లో ఓటమి అనేది ఓటమి లేకుండా ఉంది. న్యూజీలాండ్‌తో కాన్పూర్‌ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ కేవలం ఒక వికెట్ దూరంలోనే ఆగిపోయింది. చివరి వరకు విజయం కోసం భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించినా కూడా... ఫలితం మాత్రం అనుకూలంగా రాలేదు. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్డేడియం వేదికగా జరిగిన భారత్ - న్యూజీలాండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ డ్రా గా ముగిసింది. 284 పరుగుల విజయ లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజీలాండ్ జట్టు.... 9 వికెట్లు కోల్పోయి కేవలం 165 పరుగులు మాత్రమే చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా... తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ సెంచరీకి తోడు... శుభమాన్ గిల్, రవీంద్ర జడేజా హఫ్ సెంచరీలతో రాణించారు. అటు న్యూజీలాండ్ జట్టు కూడా భారత్ బౌలర్లను ధీటుగానే ఎదుర్కొంది. ఓపెనర్లు లాథమ్, విల్ యంగ్ దాదాపు సెంచరీ చేసినంత పని చేశారు. లాథమ్ 95, విల్ యంగ్ 89 రన్స్ చేశారు. తొలి వికెట్‌కు ఏకంగా 151 రన్స్ జోడించారు. కానీ ఆ తర్వాత మాత్రం కివీస్ ఇన్నింగ్స్‌ పేక మేడలా కూలింది.

49 రన్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స ఆరంభించిన టీమిండియాకు కేవలం 55 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే సెంచరీ వీరుడు శ్రేయస్ అయ్యర్ మరోసారి భారత్ ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచాడు. అశ్విన్‌, వృధిమాన్ సాహాతో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపాడు. శ్రేయస్ 65, అశ్విన్ 32 రన్స్ చేసి అవుటవ్వగా, 61 పరుగులతో సాహా, అక్సర్ పటేల్ 28 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. 284 పరుగులు టార్గెట్‌తో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. యంగ్ 2 పరుగులు చేసి అవుటయ్యాడు. లాథమ్, సోమర్, విలియమ్‌సన్ మినహా మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. 155 పరుగులకే 9 వికెట్లు కోల్పోయిన దశలో దాదాపు ఓటమి అంచున ఉన్న కివీస్‌ను రవిన్ రవీంద్ర, పటేల్ జోడి కాపాడింది. చివరి వరకు మరో వికెట్ పడకుండా భారత్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. చివరికి ఫలితం కోసం దాదాపు 5 ఓవర్లు ఎక్కువ ఆడించేందుకు ప్రయత్నించినప్పటికీ... వెలుతురు సరిగా లేని కారణంగా మ్యాచ్ రద్దయినట్లు మ్యాచ్ రిఫరీ వెల్లడించారు. దీంతో 38 ఏళ్లుగా కాన్పూర్‌లో ఓటమి లేకుండా కాపాడుకుంటున్న రికార్డును టీమిండియా కాపాడుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: