బంగ్లాదేశ్ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్‌ తో టెస్ట్ సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ లో భాగంగా జరిగిన మొదటి టెస్ట్ లో విజయం సాధించి చరిత్ర సృష్టించిన బంగ్లా రెండో టెస్టులో మాత్రం అనుకున్న విధంగా కాకుండా రాణించలేకపోతుంది. ఇక ఈ రెండో టెస్ట్‌లో బంగ్లాదేశ్‌ ఆటగాడు ఎబాదత్‌ హొసేన్‌ చెత్త రికార్డు నమోదు చేశాడు. గత 10 ఇన్నింగ్స్‌ల్లో ఖాతా తెరవని తొలి అంతర్జాతీయ బ్యాటర్ గా నిలిచాడు. అంతకుముందు న్యూజిలాండ్ క్రికెటర్ క్రిస్ మార్టిన్, శ్రీలంక ఆటగాడు లహీరు కుమార వరుసగా 9 ఇన్నింగ్స్‌ల్లో డక్ ఔట్ కాగా, తాజాగా ఆ చెత్త రికార్డును హొసేన్‌ తన పేరిట రాసుకున్నాడు. అయితే గత 10 ఇన్నింగ్స్‌ల్లో 7 సార్లు ఖాతా తెరవకుండా నాటౌట్‌గా నిలిచిన హోసేన్‌.. 3 సార్లు డకౌట్ అయ్యాడు. దీంతో పాటుగా... హొసేన్‌ మరో అవమానకర రికార్డును సైతం సొంత చేసుకున్నాడు.

అదేంటంటే... టెస్ట్‌ల్లో 16 ఇన్నింగ్స్‌ల తర్వాత అతి తక్కువ పరుగులు చేసిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు 11 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడిన హొసేన్‌.. మొత్తం 16 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. 2019లో భారత్‌తో జరిగిన కోల్‌కతా టెస్ట్‌లో చేసిన 2 పరుగులే అతనికి అత్యధికం కావడం గమనార్హం. అయితే ఈ జాబితాలో హొసేన్‌ తర్వాత... జింబాబ్వే మాజీ ఆటగాడు పోమీ బాంగ్వా 16 ఇన్నింగ్స్‌ల తర్వాత 16 పరుగులు చేయగా... మూడో స్థానంలో భారత పేసర్‌ బుమ్రా 16 ఇన్నింగ్స్‌ల తర్వాత 18 పరుగులతో ఉన్నాడు. అయితే కివీస్ పై బంగ్లా గెలిచిన మొదటి టెస్టులో పేసర్‌ హొసేన్‌ కీలక పాత్ర పోషించాడు. ఫస్ట్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసిన అతను... రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్‌ తో రాణించాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్‌లో టామ్‌ లాథమ్‌ డబుల్ సెంచరీ, డెవాన్‌ కాన్వే సెంచరీ సహాయంతో కివీస్ తొలి ఇన్నింగ్స్‌ 521 వద్ద డిక్లేర్‌ చేయగా... అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌ 126 పరుగులకే కుప్పకూలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: