భారత్ లో క్రికెట్ కి ఉండే క్రేజ్ ఆకాశమే హద్దుగా ఉంటుంది. క్రికెట్ తో మన భావోద్వేగాలు ముడిపడిపోయాయి. ఇది కాదనలేనిది. క్రికెట్ అభిమానం ఇప్పటిది కాదు. ఎప్పటినుంచో ఉంది. పాకిస్థాన్ తో మ్యాచ్ అంటే ప్రతి భారతీయుడికి యుద్ధంతో సమానం. వరల్డ్ కప్ వచ్చిందంటే ఆ మానియా ఓ రేంజ్ లో ఉంటుంది. ఇండియా కప్ నెగ్గాలి. ఇక ఆ నెలన్నర రోజులు భారత్ లో క్రికెట్ సందడే. 

 

 

అటువంటి క్రికెట్ 2019 వరల్డ్ కప్ లో భారత్ సెమీఫైనల్ ఓడిపోయింది. ఇది సగటు భారతీయుడిని బాధించేదే. దీంతో కొందరు TV లు పగలగొట్టడం, క్రికెటర్లను బండ బూతులు తిడుతూ వీడియోలు పోస్ట్ చేయడం, బాధతో అన్నం కూడా తినడం మానేయడం, ఆరోగ్యం పాడుచేసుకోవడం జరిగింది. కానీ ఆటలో గెలుపోటములు సహజం. ఈ సమయంలో లాజిక్ కి కనెక్టవటం కష్టమే. “ఇలా ఆడి ఉంటే బాగుండేది.. చెత్తగా ఆడారు” అంటూ విమర్శలూ సహజమే. ఇది వారి తప్పు కాదు. క్రికెట్ పై అభిమానుల మనసుల్లో ఉన్న ప్రేమ అలా మాట్లాడిస్తుంది. తర్వాత్తర్వాత తేరుకున్నా.. అప్పటికి ఆ ఫ్రస్ట్రేషన్ ఆపుకోలేరు. టైమ్ పడుతుంది. కానీ ఈలోపు జరగాల్సిన నష్టం జరుగుతుంది. ఇందుకు భావోద్వేగాలకు గురై, ఇంట్లో వారిపై కోపం ప్రదర్శిస్తే చులకన అవుతాం, వస్తువులను పగులకొడితే మనం తయారు చేయలేం.. కొత్తది కొనటానికి ఖర్చు, బావోధ్వేగాలకు గురైతే ఆరోగ్యం పాడవటం తప్ప ఏం ఉపయోగం లేదు.

 

మన బాధ, భావోద్వేగం చాలా విలువైనవి. వాటిని వృధా చేయొద్దు. భారత జట్టు సెమీ ఫైనల్ల్లో ఓడిపోయిందంతే. దీనివల్ల అంతర్జాతీయ స్థాయిలో భారత్ పరువేమీ పోదు. దేశం నుంచి క్రికెట్ ను బహిష్కరించరు. క్రికెటర్లను అరెస్టులు కూడా చేయరు. అమితంగా ప్రేమించేది ఏది దక్కకున్నా మనసుకి బాధ సహజం. దాన్ని హద్దుల్లో ఉంచి, మలి మ్యాచ్ ల్లో గెలవాలని కోరుకోవడం తప్ప మనం చేయగలిగిందేమీ లేదు.

 

నిజ్జంగా బాధ పడాలంటే.. మన తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా లేనప్పుడు బాధ పడాలి, మనం చేరుకోవాల్సిన లక్ష్యాన్ని చేరుకోనపుడు బాధ పడాలి, మన పిల్లల అవసరాలు తీర్చే శక్తి లేనపుడు బాధ పడాలి, సమాజంలో మంచి, మానవత్వం నశించినపుడు బాధ పడాలి, సరిహద్దుల్లో సైన్యం మనకోసం చనిపోతే బాధపడాలి, అన్నం పెట్టే రైతు కష్టాలు పడుతుంటే బాధపడాలి. క్రికెట్ లో ఓటమి కోసం వ్యధ చెందడం వృథా. ఓటమిని నిన్నటితోనే వదిలేసి, రేపటి కోసం లక్ష్యాలు పెట్టుకుని ఈరోజే సాధించడానికి ప్రయత్నిద్దాం. మనం గెలిచి.. క్రికెట్ లో గెలవాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: