యాషెస్‌ సిరీస్‌లో భాగంగా గురువారం తొలి టెస్టు ప్రారంభమైంది.ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌ అభిమానులు తనని వెక్కిరించడంపై ఆస్ట్రేలియా క్రికెటర్‌ స్టీవ్‌స్మిత్‌ స్పందించాడు.ఐతే,ఆ వెక్కిరింపులు తనను బాధించలేవని, తనకు తోటి ఆసీస్ ఆటగాళ్ల మద్దతు ఉందని పేర్కొన్నాడు. బాల్‌ టాంపరింగ్‌ వివాదం కారణంగా ఏడాది పాటు క్రికెట్‌కు దూరమైన అతడు ప్రపంచకప్‌ ద్వారా తిరిగి జట్టులో చేరాడు.తాజాగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో తొలి రోజు సెంచరీ కొట్టి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌ జట్టుకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది.




ఎందుకంటే ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ , బాన్‌క్రాఫ్ట్‌ , ఖవాజా  తక్కువ పరుగులు చేసి వెనుతిరిగటంతో. స్టీవ్‌స్మిత్‌ ఆ సమయంలో బ్యాటింగ్‌కు రావడంతో కొందరు అభిమానులు అతడిని ఎగతాళి చేశారు. బాల్‌ టాంపరింగ్‌ వివాద సమయంలో స్మిత్‌ ఏడుస్తున్న ఫొటోలను మాస్కులుగా ధరించి అవహేళన చేశారు. ఆ అవమానాలను భరించిన అతడు క్రీజులో పాతుకుపోయి టెస్టు కెరీర్‌లో 24వ శతకం బాదాడు.122 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాను చివరి రెండు వికెట్ల సహకారంతో 284 పరుగులు వరకు తీసుకెళ్ళి జట్టు గౌరవాన్ని కాపాడాడు.



ఐతే, అతడు శతకం బాదగానే స్టేడియంలోని అభిమానులు ఒక్కసారిగా కరతాళ ధ్వనులతో చప్పట్లు కొట్టి అభినందించారు. మ్యాచ్‌ అనంతరం స్మిత్‌ మీడియాతో మాట్లాడుతూ, తనకు డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆటగాళ్ల మద్దతు లభించిందనీ, అదే తనకు ముఖ్యమని తెలిపాడు. శతకం తర్వాత అభిమానులు చప్పట్లు కొడుతుంటే వెన్నులో వణుకు పుట్టిందని చెప్పాడు. టెస్టుల్లో చాలా రోజుల తర్వాత శతకం బాదడం ఆనందంగా ఉందని స్మిత్‌ అన్నాడు. అయితే ఏడాది పాటు ఆటకు దూరమైనప్పుడు ఒకానొక సమయంలో తనకు క్రికెట్‌పై ఇష్టం పోయిందని, మళ్లీ బ్యాట్‌ పడతాననే నమ్మకం పోయిందని వివరించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: