ప్రత్యర్థి.. 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచిన స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌.. ఇతనికేమో తొలి గ్రాండ్ స్లామ్ టోర్నీ. అయితేనేం.. ప్రత్యర్థికి తలవంచలేదు. పోరాడాడు.. యుఎస్ ఓపెన్ తొలి రౌండ్‌లోనే దిగ్గజ ఆటగానికి భారత యువ టెన్నిస్ సంచలనం  సుమిత్ నగల్ ముచ్చెమటలు పట్టించాడు. ఈ మ్యాచ్ భారత టెన్నిస్ అభిమానులకు సరైన మజాను అందించింది. సుమిత్ ఆటతీరును దిగ్గజ టెన్నిస్ ఆటగాళ్లు సైతం కొనియాడుతున్నారంటే పెదరర్ పై ఏ విధంగా పోరాడాడో తెలుస్తుంది.


వివరాల్లోకెళితే.. సుమిత్ నగల్.. హర్యానాకు చెందిన ఈ 22 ఏళ్ల కుర్రాడు యుఎస్ ఓపెన్ లో దిగ్గజ క్రీడాకారుడు రోజర్ పెదరర్ పై సెట్‌ను నెగ్గడం అంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం 190వ ర్యాంకులో ఉన్న సుమిత్ నగల్ క్వాలిఫయిర్స్ ద్వారా యుఎస్ ఓపెన్‌కు ఎంపికయ్యాడు. తొలి సెట్‌లోనే ఫెద‌ర‌ర్‌కు ముచ్చెమటలు పట్టించాడు. రెండున్నర గంటల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ అద్భుత ఆటతో 64 తేడాతో తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. 


అయితే.. అనంతరం వరుస సెట్‌లలో ఫెద‌ర‌ర్‌ పుంజుకోవడంతో సుమిత్ ఓటమిని చవిచూశాడు. ఫెద‌ర‌ర్‌ 4-6, 6-1, 6-2, 6-4 తేడాతో సుమిత్‌పై విజయం సాధించి యుఎస్‌ ఓపెన్‌లో శుభారంభం చేశాడు. కాగా, మ్యాచ్‌కు ముందు సమిత్ నగల్ మాట్లాడుతూ "ఇది గేమ్ గెలవడం లేదా ఓడిపోవడం గురించి కాదు. ఇది అనుభవం మాత్రమే. ఇది 20 గ్రాండ్ స్లామ్‌లను గెలుచుకున్న వ్యక్తితో ఆడుతోంది" అని తెలిపాడు. సుమిత్.. యుఎస్ ఓపెన్‌ తొలి రౌండ్‌లో రోజర్ ఫెదరర్ చేతిలో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించినప్పటికీ... తన ఆటతీరుతో భారత టెన్నిస్ అభిమానుల మనసు గెలుచుకుని భవిష్యత్తు టెన్నిస్ ఆశాకిరణంగా నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: