యూఎస్‌ ఓపెన్‌లో మరో కొత్త ఛాంపియన్‌ అవతరించింది. 20 ఏళ్ల అనుభవాన్ని చిత్తు చేసింది 20 ఏళ్లు నిండని అమ్మాయి. టీనేజ్‌లోనే గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కొట్టిన ఫస్ట్‌ కెనడియన్‌ ప్లేయర్‌గా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది బియాంక అండ్రెస్క్‌. మార్గరెట్‌ కోర్ట్‌ రికార్డ్‌ను సమం చేయాలన్న సెరెనా ఆశలను చిత్తుచేసింది 19 ఏళ్ల బియాంక. మార్గరెట్‌ కోర్ట్‌ రికార్డ్‌ను సమం చేయాలన్న సెరెనా కల ఆవిరయ్యింది. యూఎస్‌  ఓపెన్‌ ఫైనల్లో ఈ మాజీ ఛాంపియన్‌ 3-6, 5-7 తేడాతో బియాంక చేతిలో ఓడిపోయింది. ఎలాగైనా గెలవాలన్న కసితో ఆడిన టీనేజ్‌ గర్ల్‌ బియాంక ఫస్ట్‌ సెట్‌ నుంచి అమెరికా దిగ్గజానికి చుక్కలు చూపించింది. పదునైన సర్వీస్‌లతో, బలమైన బ్యాక్‌హ్యాండ్‌ షాట్లతో సెరెనాకి చెక్‌ పెట్టింది కెనడియన్‌ ప్లేయర్‌. తొలిసెట్‌ను 3-6తో సునాయాసంగా గెలిచింది బియాంక.  రెండో సెట్‌లో సెరెనా తన అనుభవాన్ని ఉపయోగించి ఆడిన లాభం లేకపోయింది. 


కీలక సమయాల్లో బ్రేక్‌ పాయింట్లు కాచుకోని రెండో సెట్‌ని కైవసం చేసుకుంది 19 ఏళ్ల బియాంక. గత 7 గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో 4 సార్లు ఓడిపోయింది అమెరికా నల్లకలువ. ఈ సారి ఎలాగైనా గెలిచి చరిత్ర సృష్టించాలనుకున్న సెరెనా అనవసర సమయాల్లో తప్పిదాలు చేసి మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఏడాది క్రితం ఇదే సమయంలో 200లోపు ర్యాంక్‌లో కూడా లేని ఆండ్రిస్క్ ఇప్పుడు యూఎస్‌ ఛాంపియన్‌ అయింది. ఇప్పటి వరకు టాప్‌10లోపు క్రీడాకారిణులతో  ఏడుసార్లు తలపడితే ఏడు సార్లూ ఆండ్రిస్క్ విజయం సాధించింది.  యూఎస్‌ ఓపెన్‌లో తొలిసారి బరిలోకి దిగినప్పుడే టైటిల్‌ కొట్టిన ప్లేయర్‌గా చరిత్ర క్రియేట్ చేసింది బియాంక. తన అభిమాన టెన్నిస్‌ ప్లేయర్‌ను ఓడించి.. నయా ఛాంపియన్‌గా అవతరించింది ఈ 19 ఏళ్ల భామ.


మరింత సమాచారం తెలుసుకోండి: