ప్రముఖ స్టార్ షట్లర్, వరల్డ్ ఛాంపియన్ షిప్ సాధించిన సింధుకు అభినందనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఆమె అభినందనల జల్లుల్లో తడిసి ముద్దవుతోంది. తన అద్భుతమైన ఆట తీరుతో సింధు భారతీయుల హృదయాలను గెలుచుకుంది. ఇప్పటికే ఎన్నో సన్మానాలు, బహుమానాలు అందుకున్న సింధుకు మరో భారీ బహుమానం అందుకుంది.

 

 

 

చాముండేశ్వరీనాథ్ ఆమెకు బీఎండబ్ల్యూ కారు బహుమతిగా ఇచ్చారు. ఈ కారును టాలీవుడ్ నవ మన్మధుడు నాగార్జున చేతుల మీదుగా  సింధు అందుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాగార్జున పాల్గొని కారు తాళాలను ఆమెకు అందజేశారు. ఈ సందర్బంగా నాగార్జున మాట్లాడుతూ.. పీవీ సింధుకు తాను కూడా అభిమానినేనన్నారు. తన ఆట తీరు ఎంతో బాగుంటుందని కొనియాడారు. వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు తాను అమెరికాలో ఉన్నట్టు తెలిపారు. అక్కడే ఆ మ్యాచ్ చూశానని అన్నారు. తన అద్భుతమైన ఆట తీరుతో భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం సింధు మాట్లాడుతూ.. టాలీవుడ్ లో నాగార్జున ఎవర్ గ్రీన్ కథానాయకుడని అన్నారు. ఆయన చేతుల మీదుగా కారు అందుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. వరల్డ్ ఛాంపియన్ షిప్ టైటిల్ అందుకోవడం ఓ మధురానుభూతి అని అన్నారు. బ్యాడ్మింటన్ లో మరింతగా రాణించేందుకు కృషి చేస్తానని సింధు తెలిపారు.

 

 

 

ఇప్పటివరకూ చాముండేశ్వరీనాథ్ పలువురు క్రీడాకారులకు 22 కార్లు బహుమతిగా ఇచ్చారు. ఇందులో సింధునే నాలుగు కార్లను  బహుమతిగా అందుకోవడం విశేషం. ఒలింపిక్స్ లో పతకాలు గెలుచుకున్న భారత క్రీడాకారులకు కూడా ఆయన బీఎండబ్ల్యూ కార్లను బహుకరించారు. అప్పట్లో క్రికెట్ మాస్టర్ సచిన్ చేతుల మీదుగా కార్లను అందించారు. ఈ కార్యక్రమంలో కోచ్ గోపిచంద్ తోపాటు పలువురు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: