టీమిండియా మాజీ కెప్టేన్ మహేంద్ర సింగ్ దోనీపై ప్రపంచ క్రికెట్ దిగ్గజాలు ప్రశంసలు గుప్పించడం తరచుగా జరిగేదే. అలా మహీపై ప్రశంసలు గుప్పించిన మేటి ఆటగాళ్ల జాబితాలో ఇంగ్లండ్ మాజీ కెప్టేన్ మైఖెల్ వాన్ కూడా చేరిపోయాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన ఓ కథనం ప్రకారం అతడు ఆ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలువురు అంతర్జాతీయ క్రికెటర్ల గురించి, ప్రస్తుత క్రికెట్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఈ తరంలో టాప్ ఇంటర్నేషనల్ కెప్టేన్ ఎవరనే ప్రశ్నకు వాన్ స్పందిస్తూ.. ''ప్రస్తుత క్రికెట్‌లో పరిమిత ఓవర్ల ఆటలో ధోనియే అత్యుత్తమ నాయకుడని, వికెట్ల వెనుక కీపింగ్ చేస్తూ ఆటలో గమనాన్ని అర్థం చేసుకునే తీరు, ఒత్తిడిని తట్టుకునే నేర్పు, బ్యాటింగ్ చేయగల నైపుణ్యం అతడి సొంతం'' అని అభిప్రాయపడ్డాడు. ''అంతర్జాతీయ క్రికెట్‌లో ధోనీ ప్రస్తుతం కెప్టెన్సీ చేయకపోయినా.. మన తరంలో నేను చూసిన కెప్టేన్స్‌లో ది బెస్ట్ కెప్టేన్ అతడే'' అంటూ ధోనీపై వాన్ ప్రశంసలు గుప్పించాడు. 

ఇక ప్రస్తుత కెప్టేన్ విరాట్ కోహ్లీ గురించి చెబుతూ.. కోహ్లీ శక్తి సామర్థ్యాలే అతడిని టెస్టుల్లో ఉత్సాహభరితమైన కెప్టేన్‌గా నిలబెడతాయని మైఖేల్ వాన్ అన్నారు. అతడు జీవితాంతం అద్భుతమైన ఫామ్‌లో ఉంటాడని విశ్వాసం వ్యక్తంచేసిన మైఖేల్ వాన్.. కోహ్లీ కెప్టేన్సీ తీరు అద్భుతంగా ఉంటుందని కితాబిచ్చాడు. 

కెప్టేన్ అనే వాడు ఎలా ఉండాలనే అంశంపై వాన్ మాట్లాడుతూ.. కెప్టేన్ అనేవాడు ఆటపై పట్టు ఉండటంతోపాటు మైదానం బయట తోటి ఆటగాళ్లతో ఎలా వ్యవహరించాలో తెలిసి ఉండాలని. అప్పుడే అందరినీ సమన్వయం చేసుకుపోగలడని అభిప్రాయపడ్డాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: