సైన్స్ రోజు రోజుకు ముందుకు వెళ్తోంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ఆవిష్క‌ర‌ణ‌లు సృష్టి అవుతున్నాయి. అందులో భాగంగానే మాన‌వ మూత్రం నుంచి విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఇప్పుడు కోళ్లు, మ‌నుషుల మ‌లం నుంచి కూడా క‌రెంట్ ఉత్ప‌త్తి సాధ్యం అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ దిశ‌గా ఇజ్రాయెల్‌లోని బెన్ గురియ‌న్ యూనివ‌ర్సిటీకి చెందిన శాస్త్ర‌వేత్త‌లు ఇటీవ‌ల మాన‌వ మ‌లం నుంచి శ‌క్తిని ఉత్ప‌త్తి చేసేందుకు ఫీల్డ్ లావెట‌రీని ఏర్పాటు చేశారు.  ఫౌల్ట్రీ వ్య‌ర్థాల‌తో ప‌రిశోధ‌న చేసిన ప‌రిశోధ‌కుల బృందం, ఆ త‌రువాత మాన‌వ మ‌లంతో ప్రయోగాలు చేసింది.


 ఇందులో భాగంగా మ‌లాన్ని ఆటోక్లేవ్స్‌లో వేడి చేసి సుక్ష్మ‌క్రిముల‌ను త‌ట‌స్థీక‌రించి పొడి రూపంలోకి తీసుకొస్తారు.   దీనికి నీళ్ల‌ను క‌లిపి చిన్న ఇటుక‌లుగా త‌యారు చేసి.. త‌రువాత అధిక ఉష్ణోగ్ర‌త, పీడ‌నం ద‌గ్గ‌ర  50 మిల్లీ లీట‌ర్ ల్యాబ్ రియాక్ట‌ర్స్‌లోకి లోడ్ చేస్తారు. వాటిని 180 డిగ్రీల సెల్సీయ‌స్ ఉష్ణోగ్ర‌త‌ల మ‌ధ్య బాయిల్ చేస్తూ ఆయా టెంప‌రేచ‌ర్స్‌లో జరిగే చ‌ర్య‌ల‌ను ప‌రిశీలించారు. ఈ ప్ర‌క్రియ‌ను హెచ్‌టీసీ (హైడ్రోథ‌ర్మ‌ల్ కార్భొనైజేష‌న్) అంటారు. ఇది హైడ్రోచార్‌ను ఉత్ప‌త్తి చేస్తుంది. హైడ్రోచార్‌ను దాని ద‌హ‌న ల‌క్ష‌ణాల ఆధారంగా బొగ్గు లాగా ఉప‌యోగించుకోవ‌చ్చు.. లేదా బొగ్గుతో న‌డిచే విద్యుత్ ప్లాంట్‌కు ఇండ‌స్ట్రియ‌ల్ ఫ‌ర్నేస్‌కు అందించ‌వ‌చ్చు.


 ఇక కోళ్ల విస‌ర్జితాల‌తో ప్రయోగం చేయ‌గా అందులోని ఫైన‌ల్ ప్రొడ‌క్ట్ లీట‌ర్ కార్భ‌న్‌, నైట్రోజ‌న్‌తో నిండి ఉంటుంది. ఇవి శ‌క్తిని ఉత్ప‌త్తి చేయ‌డానికి అవ‌స‌రం అవుతుంది. ఇక్క‌డ కూడా హెచ్‌టీసీ ప్ర‌క్రియ‌ను అనుస‌రించి హైడ్రోచార్ త‌యారు చేస్తారు. శిలాజ ఇంధ‌నాల ఒత్తిడిని త‌గ్గించ‌డానికి ప‌రిశ్ర‌మ ఉత్ప‌త్తిలో ఉప‌యోగించే మొత్తం బొగ్గులో 10 శాతాన్ని పౌల్ట్రీ పేడ భ‌ర్తీ చేయ‌గ‌ల‌ద‌ని బృందం అంచ‌నా వేసింది. ఆయిన‌ప్ప‌టికీ.. శ‌క్తి ఉత్ప‌త్తి ప‌రంగా మాన‌వ మ‌లం మ‌రింత ప్ర‌భావ వంతంగా ఉన్న‌ట్టు ప‌రిశోధ‌న బృందం  వెల్ల‌డిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: