త‌న‌కు మాలిన నీతులు చెప్ప‌డంలో, సొంత డ‌బ్బా కొట్టుకోవ‌డంలో టీవీ9ను మించిన చానెల్ లేదు. రేటింగ్ విష‌యంలో ఆ చానెల్ రెండు రోజుల కింద‌ట చేసిన హంగామానే ఇందుకు నిద‌ర్శ‌నం. ఏపీ, తెలంగాణ‌, హైద‌రాబాద్‌ల‌లో త‌మ చానెలే నంబ‌ర్‌ వ‌న్ అంటూ సెల్ఫ్ యాడ్ల‌తో హోరెత్తించింది. త‌మ‌కు సాటి ఎవ‌రూ లేరంటూ చాటుకుంది. ప‌నిలో ప‌నిగా త‌మకున్నంత‌ నిజాయితీ, నిబ‌ద్ధ‌త‌, ఉన్న‌త ప్ర‌మాణాలు ఎవ‌రికీ లేవ‌న్న‌ట్లు ఊద‌ర‌గొట్టింది. ఈ ప్ర‌చారాన్ని చూసిన తెలంగాణ నెటిజ‌న్లు టీవీ9పై రుస‌రుస‌లాడారు. తెలంగాణ‌, హైద‌రాబాద్‌లు రెండు వేర్వేరు రాష్ట్రాల‌న్న‌ట్లు ఎందుకు చూపిస్తున్నారు?  హైద‌రాబాద్‌... తెలంగాణ‌లో లేదా అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శ్న‌లు సంధించారు. విష‌యం ఏమిటంటే, టీవీ చానెళ్ల‌కు రేటింగులు ఇచ్చే బార్క్ సంస్థ తెలంగాణ‌, హైద‌రాబాద్‌ల‌కు వేర్వేరుగా రేటింగులు ఇస్తుంది. నెటిజ‌న్ల ఆగ్ర‌హాన్ని గ‌మ‌నించిన టీవీ9 యాజ‌మాన్యం అస‌లు విష‌యాన్ని బ‌య‌టికి చెప్ప‌లేక 
ప్ర‌స్తుతానికి మౌన‌వ్ర‌తాన్ని ఆశ్ర‌యించింది. 

తాజా రేటింగుల ప్ర‌కారం టీవీ9, వీ6, టీ న్యూస్‌, ఎన్‌టీవీ, టీవీ5 జీఆర్పీ ప‌రంగా తొలి  ఐదు స్థానాల్లో ఉన్నాయి. హెచ్ఎం టీవీ, ఈటీవీ తెలంగాణ‌, ఏబీఎన్‌, 10 టీవీ త‌ర్వాతి ర్యాంకింగ్ సాధించాయి. సాక్షి టీవీ వీట‌న్నిటి కంటే దిగువ‌న‌ 10వ స్థానంలో నిలిచింది. మిగిలిన చానెళ్ల ప‌రిస్థితి మ‌రింత దారుణం.

క‌రోనా వార్త‌లు చూడ‌లేక‌... చానెళ్ల రేటింగ్స్ ప‌త‌నం
సుమారు 50 రోజులుగా ఏ చానెల్‌లో చూసినా క‌రోనా వార్త‌లే క‌న్పిస్తున్నాయి, విన్పిస్తున్నాయి. ఎప్పుడూ అవే వార్త‌లు ఏం చూస్తాంలే అనుకుంటూ ప్రేక్ష‌కులు ఎంట‌ర్‌టైన్‌మెంట్ చానెళ్ల‌వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో న్యూస్ చానెళ్ల రేటింగ్స్ తగ్గుముఖం ప‌ట్టాయి. అదీ ఇదీ అని కాదు, అన్ని చానెళ్ల‌దీ అదే ప‌రిస్థితి. జీఆర్పీ త‌గ్గిపోవ‌డంతో ఉలిక్కిప‌డిన తెలుగు చానెళ్లు ఇపుడు క‌రోనా క‌బుర్ల‌తో పాటు ఇత‌ర వార్త‌లకూ కాస్త ప్రాధాన్యం ఇస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: