బిగ్ బాస్ షోలో ప్రతీ సీజన్లో ఖచ్చితంగా ఒక్క వ్యక్తినైనా సింగింగ్ టాలెంట్ ఉన్నవారిని హౌస్ లో ప్రవేశపెడుతున్నారు. వారిలో ఎవరో ఒకరు షో చివరి దశ వరకు ఉంటున్నారు. అలాగే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 4లో నోయల్ ప్రయాణం కూడా సాగుతోంది. సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌‌ను గెలిపించడంలో  నోయల్ బాగా కష్టపడ్డాడంటుంటారు కొందరు అభిమానులు. నిజానికి రాహుల్ కంటే ముందే బిగ్ బాస్ హౌస్‌కి నోయల్ వెళ్లాల్సి ఉండగా.. పరిస్థితులు అనుకూలించకపోవడంతో బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పటికీ ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నారట నోయల్. అయితే ఇప్పుడు ఈ సీజన్ 4లో నోయల్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు. ఇక నోయల్‌తో పాటు హౌస్‌లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్స్ వారం వారం తమ ఆటను మెరుగుపరుచుకుంటూ దూసుకుపోతుంటే.. నోయల్ మాత్రం స్లో అండ్ స్టడీగా వెళ్తుండటం విశేషం.

అయితే నోయల్ ఆటపై సరిగా ఫోకస్ పెట్టలేకపోవడానికి అతను దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతుండటమే కారణమని తెలుస్తోంది. నోయల్.. ఆర్థరైటిస్ వ్యాధితో బాధపడుతుండటంతో ఫిజికల్ టాస్క్‌లలో సరిగా పెర్ఫామెన్స్ చేయలేకపోతున్నాడు. ఈ దీర్ఘకాలిక వ్యాధి ఎక్కువగా కీళ్లను ప్రభావితం చేస్తుంది. చల్లటి ప్రదేశంలో ఉంటే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. అందుకే నోయల్ కూడా ఏసీలో పడుకోకుండా ఎక్కువగా బయట పడుకుంటున్నాడు. ఈ వ్యాధి లక్షణాల ప్రకారం.. కీళ్ల వాపు, కీళ్ళు దృఢంగా లేకపోవడం, జాయింట్ ఫంక్షన్ లోపించడం లాంటివి ఎక్కువగా ఉంటాయి. ఈ వ్యాధి తీవ్రత ఎక్కువైతే మణికట్టు, మోకాలు, చీలమండలు, మోచేతులు, భుజాలు ప్రభావితం అవుతాయి. బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లిన తరువాత వాతావరణంతో పాటు ఆహార మార్పుల వల్ల నోయల్ బాగా ఇబ్బంది పడుతూ కనిపిస్తున్నాడు. కీళ్ల వాపుతో సరిగా నడవలేకపోతున్నాడు. ఈ వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో బీబీ డే కేర్ టాస్క్ నుంచి కూడా నిష్క్రమించాడు నోయల్. భుజాలు క‌ద‌ల‌డం లేద‌ని, మెడ‌పై న‌రాలు ప‌ట్టేశాయ‌ని, కాళ్లు న‌డ‌వ‌డానికి కూడా రావ‌ట్లేద‌ని నోయ‌ల్ బాధ‌ప‌డ్డాడు. దీంతో నోయల్‌కి విశ్రాంతి కల్పించారు బిగ్ బాస్. అనారోగ్య సమస్యలతో పాటు.. మాట్లాడితే వేదాంతం మాట్లాడుతూ.. అందరితో మంచి అనిపించుకోవాలనే తాపత్రయం నోయల్‌లో కనిపిస్తుండగా.. నోయల్ మాస్క్ తీయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిజమైన నోయల్ బయటకు రాలేదని హోస్ట్ నాగార్జునే బహిరంగంగానే కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.

నిజంగానే నోయల్ కూడా తన ప్రతిభకు తగ్గ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం లేదు. ముఖ్యంగా లాస్య, అభిజిత్, హారికలతో గ్రూప్‌లు కట్టి.. వాళ్ల గురించి, వీళ్ల గురించి మాట్లాడటం తప్పితే తన ఆట తాను ఆడినట్టుగా కనిపించడం లేదు. నోయల్ ఆటపై లాస్య ప్రభావం ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ ఇద్దరూ చాలా సేఫ్‌గా గేమ్ ఆడుతూ.. సింపథీ ఓట్ల కోసం తాపత్రాయ పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే నోయల్‌కి హెల్త్ ఇష్యూస్ ఉండటం వల్ల ఫిజికల్ టాస్క్‌లో సరిగా పార్టిసిపేట్ చేయలేకపోతున్నాడు. ఆరోగ్యం సహకరించకపోవడంతో గంగవ్వను పంపించినట్టే తనను కూడా హౌస్ నుంచి బయటకు పంపించమని బిగ్ బాస్ వాళ్లకి చెప్పినట్టుగా అన్ సీన్ వీడియోలో తెలియజేశాడు నోయల్. అయితే అతని అభిమానులు మాత్రం నోయల్‌ ఖచ్చితంగా పుంజుకుంటాడని.. చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అతనికి లెక్క కాదని.. ఎట్టి పరిస్థితుల్లోనూ నోయల్ బిగ్ బాస్ విన్నర్‌గానే బయటకు వస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: