ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ పేలుతున్నాయి. అలా పేలకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి చదివి వాటిని పాటించండి.

1.దాదాపుగా చాలామంది నిద్రపోయేటప్పుడు స్మార్ట్ ఫోన్ ను తల దిండు కింద పెట్టుకుని నిద్రపోతూ ఉంటారు. కానీ అలా చేయడం కారణంగా మీ శరీర బరువు దాని మీద పడి ఫోన్ అంతర్గత ఉష్ణోగ్రత పెరిగి పేలడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

2.కొంతమంది తమ స్మార్ట్ ఫోన్లపై పుస్తకాలు, ల్యాప్ టాప్ ల వంటి బరువైన వస్తువులను ఉంచుతూ ఉంటారు. అలా చేయడం వల్ల ఫోన్ అంతర్గత భాగాల ఉష్ణోగ్రత పెరిగి పేలిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్మార్ట్ ఫోన్లపై ఎప్పుడూ బరువులు ఉంచకండి. ప్రత్యేకించి చార్జింగ్ పెట్టేటప్పుడు అస్సలు బరువును ఉంచకూడదు

3.మీ స్మార్ట్ ఫోన్ ను చార్జ్ చేయడానికి కార్ చార్జింగ్ అడాప్టర్లను ఉపయోగించకండి. అంతగా కావాలనుకుంటే పవర్ బ్యాంకులను ఉపయోగించండి. కార్ చార్జింగ్ అడాప్టర్ల కారణంగా కూడా బ్యాటరీ పనితీరులో మార్పులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటిని ఉపయోగించడం అంత ఉత్తమం కాదు.

4.ఒక్కోసారి మనం ఉపయోగించేటప్పుడు మన స్మార్ట్ ఫోన్ అనుకోకుండా వేడెక్కుతూ ఉంటుంది. అప్పుడు దాన్ని ఉపయోగించకుండా పక్కన పెట్టేయడం ఉత్తమం. ఎందుకంటే మీరు దాన్ని ఉపయోగించడం కొనసాగిస్తే.. మీ ఫోన్ ఉష్ణోగ్రత మరింత పెరిగిపోయి మీ చేతుల్లోనే అది పేలిపోయే/కాలిపోయే అవకాశం ఉంది. కాబట్టి వేడెక్కుతున్న సమయంలో దాన్ని పక్కన పెట్టేయండి.

5.స్మార్ట్ ఫోన్ తో పాటు కంపెనీ వారు అందించిన చార్జర్ ని మాత్రమే ఉపయోగించండి. చార్జర్ పాడైతే అదే సంస్థ నుంచి కొత్త చార్జర్ ను కొనుగోలు చేయండి. అంతే కానీ వేరే ఇతర స్మార్ట్ ఫోన్ చార్జర్లను, బయట మార్కెట్లలో దొరికే నకిలీ చార్జర్లను కొనుగోలు చేయకండి. వాటి కారణంగా మీ ఫోన్ పేలే అవకాశాలు ఏర్పడటమే కాకుండా మీ బ్యాటరీ, ఫోన్ అంతర్గత భాగాలు పాడవుతాయి.

6.సాధారణంగా మనలో చాలా మంది ఫోన్ ను రాత్రంతా చార్జింగ్ పెడుతూ ఉంటారు. అయితే దాని వల్ల కూడా బ్యాటరీ దెబ్బతినే ప్రభావం ఉంటుంది. ఎందుకంటే దీని వల్ల ఫోన్ పూర్తిగా చార్జ్ అవ్వగానే బ్యాటరీ చార్జ్ కావడం ఆగుతుంది. కానీ అది 99 శాతానికి రాగానే మళ్లీ చార్జ్ అవ్వడం మొదలవుతుంది. కాబట్టి ఫోన్ ప్రాసెసర్ రాత్రంతా పని చేస్తూనే ఉంటుంది.

7.మీ ఫోన్ చార్జ్ అయ్యేటప్పుడు దాన్ని అస్సలు ఎండలో ఉంచకండి. ఎందుకంటే చార్జ్ అయ్యే సమయంలో స్మార్ట్ ఫోన్ పై ఎండ పడితే అప్పుడు అది పేలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు స్మార్ట్ ఫోన్ చార్జింగ్ పెట్టే ప్రదేశాల్లో ఎండ పడకుండా చూసుకోండి.

8.మీ స్మార్ట్ ఫోన్ ను పవర్ కార్డ్ కు చార్జింగ్ పెట్టినా కూడా అది పేలే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీలైతే నేరుగా ప్లగ్ కే పెట్టి చార్జ్ చేయడానికి ప్రయత్నించండి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప పవర్ కార్డ్, స్విచ్ బాక్స్ వంటి వాటిని ఉపయోగించకండి.

9.మీ ఫోన్ ఎప్పుడైనా కింద పడితే పైకి కనిపించకపోయినా అంతర్గత భాగాలు దెబ్బ తినే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ ఫోన్ కింద పడితే దాన్ని ఉపయోగించకుండా వెంటనే సర్వీస్ సెంటర్ కు తీసుకువెళ్లి ఏవైనా భాగాలు దెబ్బ తింటే వెంటనే మార్పించండి. బ్యాటరీకి సంబంధించిన భాగాలు దెబ్బతిని ఉంటే ఫోన్ పేలిపోయే అవకాశం ఉంది.

10.మనలో చాలా మంది ఫోన్ బ్యాటరీ పాడవ్వగానే తక్కువ ధరకే వస్తుంది కదా అని బయట మార్కెట్లో దొరికే నకిలీ బ్యాటరీలను కొనుగోలు చేస్తూ ఉంటారు. కానీ దాని కారణంగా కూడా స్మార్ట్ ఫోన్లు పేలిపోతూ ఉంటాయి. ఎందుకంటే వాటి నాణ్యత అరకొరగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా బ్యాటరీని కొనుగోలు చేయాల్సి వస్తే కచ్చితంగా కంపెనీ బ్యాటరీని మాత్రమే కొనుగోలు చేయండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: