రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏం చేసినా సంచలనమే..! జియో పేరుతో టెలికం రంగంలో అడుగుపెట్టి... ఆ రంగంలో ఉన్న ఇతర సంస్థలకు ముచ్చెమటలు పట్టించింది. రిలయన్స్ జియో రాకతో దేశీయ టెలికం రంగంలో మొబైల్ డేటా విప్లవానికి తెర లేసింది. తక్కువ ధరకే ఎక్కువ డేటా ఇవ్వడంతో ఇతర నెట్ వర్క్ యూజర్లంతా జియో బాటపట్టారు. తమ కస్టమర్లను ఆకర్షించేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర నెట్ వర్క్ లు కూడా జియో బాటలోనే డేటా ధరలతో ముందుకొచ్చాయి. ఇక ఇటీవల తమ ఖాతాదారులకు షాకిస్తూ చార్జీల మోత మోగించింది. అయినప్పటికీ వినియోగదారులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. కొత్త కనెక్షన్ల కోసం జియో వైపే మొగ్గుచూపారు.

 

ఇప్ప‌టికీ టెలికం రంగంలో రిలయన్స్ జియో హవా కొనసాగుతోంది. ఇక అక్టోబరులో ఏకంగా 91 లక్షల మంది కొత్త ఖాతాదారులు వచ్చి చేరారు. దీంతో జియో మొత్తం సబ్‌స్క్రైబర్ల సంఖ్య 36కోట్ల 43 లక్షలకు పెరిగినట్టు ట్రాయ్ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. నిమిషానికి 6 పైసల చొప్పున ఐయూసీ ఛార్జీలను రిలయెన్స్ జియో అక్టోబర్‌లోనే ప్రకటించింది. అయితే అదే నెలలో జియో యూజర్ల సంఖ్య భారీగా పెరగడం విశేషం. అక్టోబర్ లెక్కల ప్రకారం రిలయెన్స్ జియో మార్కెట్ షేర్ 30.79%. ఆంధ్రప్రదేశ్‌, కోల్‌కతా, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్తాన్ సర్కిళ్లలో రిలయెన్స్ జియో టాప్‌లో నిలిచింది.

 

ఇక వొడాఫోన్ ఐడియా 1.9 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను చేర్చుకొని 37.27 కోట్ల యూజర్ బేస్‌కు చేరుకోగా, 81,974 మంది సబ్‌స్క్రైబర్లను చేర్చుకొని 32.56 కోట్లకు చేరుకుంది భారతీ ఎయిర్‌టెల్. ఇక మొత్తంగా చూస్తే వైర్‌లెస్ టెలికామ్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య సెప్టెంబర్‌లో 117.37 కోట్లు ఉండగా, అక్టోబర్‌లో 118.34 కోట్లకు చేరుకుంది. 0.82 శాతం వృద్ధి కనిపించింది. వొడాఫోన్ ఐడియా మార్కెట్ షేర్ 31.49% కాగా, భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ షేర్ 27.52% ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఏదైమైనా జియో జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: