ప్రస్తుత ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ ల హవా నడుస్తోంది. శాంసంగ్ ఇప్పటికే ఒక ఫోల్డబుల్ ఫోన్ ను విడుదల చేయగా, మరో ఫోన్ ను కూడా త్వరలో పరిచయం చేయడానికి సిద్ధం అవుతుంది. ఎల్జీ జీ8ఎక్స్ థింక్ పేరిట రెండు డిస్ ప్లేలతో ఒక ఫోన్ ను రూపొందించింది. మోటొరోలా ఫోల్డబుల్ ఫోన్ అయిన మోటో రేజర్ కూడా లాంచ్ కు సిద్ధం అవుతుంది. అయితే ఇప్పుడు వీటితో పాటు వన్ ప్లస్ కూడా ఒక కాన్సెప్ట్ ఫోన్ ను సిద్ధం చేస్తోంది. అయితే ఫోల్డబుల్ ఫోన్లను తాము అప్పుడే విడుదల చేయబోమని వన్ ప్లస్ ఇప్పటికే తెలిపిన సంగతి తెలిసిందే.  


వన్ ప్లస్ తన కాన్సెప్ట్ ఫోన్ కు సంబంధించిన వివరాలను టీజర్ ద్వారా వివరించింది. ఈ టీజర్ లో మొదటి షాట్ ను చూడగానే మనకు అర్థమయ్యేది ఏంటంటే.. ఈ ఫోన్ కలర్ షిఫ్టింగ్ టెక్నాలజీతో రానుంది. హైఎండ్ కార్ల సన్ రూఫ్ లు, ఎయిర్ క్రాఫ్ట్ విండోల్లో ఉపయోగించే టెక్నాలజీని ఇందులో ఉపయోగించినట్లు  తెలిపింది. ఈ టెక్నాలజీ కోసం వన్ ప్లస్ ప్రముఖ కార్ల కంపెనీ మెక్ లారెన్ తో కలసి పనిచేసినట్లు సమాచారం.


వీడియోలో మనం గమనించే మరో విషయం ఏంటంటే.. ఇందులో కనిపించకుండా ఉన్న కెమెరాలు. వీటిని ఇలా కనిపించకుండానే బంధించారు కాబట్టి ఈ ఫోన్ లో కెమెరాలు ఉన్నట్లు గుర్తించడం కూడా కష్టమే. ఎందుకంటే ఇవి వెనకవైపు ఉన్న గ్లాస్ కింద ఉన్నట్లు ఈ వీడియో ద్వారా చూడవచ్చు. కెమెరా యాప్ ను ఓపెన్ చేయగానే ఎలక్ట్రికల్ సిగ్నల్ ద్వారా ఈ గ్లాస్ పారదర్శకంగా మారుతుందని, అప్పుడు మనం దీంతో ఫొటోలు తీసుకోవచ్చని లీకుల ద్వారా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలియాలంటే.. వన్ ప్లస్ దీన్ని పరిచయం చేసే దాకా ఆగక తప్పదు మరి!


అయితే.. జనవరి 7 నుంచి 10వ తేదీ మధ్య జరగనున్న సీఈఎస్ 2020 ఈవెంట్లో ఈ ఫోన్ ను పరిచయం చేయనుంది. అయితే ప్రత్యేకించి ఏ తేదీన పరిచయం చేస్తుందన్న విషయాన్ని మాత్రం వన్ ప్లస్ వెల్లడించలేదు. కాబట్టి ఈ ఫోన్ గురించి తెలుసుకోవాలంటే ఈ నాలుగు రోజులు ఇంటర్నెట్లో యాక్టివ్ గా ఉండక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: