సంక్రాంతి పండ‌గ వ‌చ్చేస్తోంది. రైల్వే స్టేషన్లలో రద్దీ పెరిగిపోతోంది. సంక్రాంతి సెలవులకు ఊరెళ్లేందుకు జనం బయల్దేరుతున్నారు. రైలు టికెట్లు కన్ఫామ్ అయినవారు హ్యాపీగా ట్రైన్ ఎక్కేస్తున్నారు. కానీ... ఇంకా బెర్తులు కన్ఫామ్ కానివారికే టెన్షన్ పెరిగిపోతోంది. ఇదిలా ఉంటే మీ అకౌంట్‌లో డ‌బ్బు లేక‌పోయినా ట్రైన్ టిక్కెట్లు బుక్ చేసుకోవ‌చ్చు. అది ఎలాగంటే.. ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్ సీటీసీ) క‌స్ట‌మ‌ర్ల‌కు తమకు అవసరమైనప్పుడు టిక్కెట్ బుక్ చేసుకుని డబ్బులు తర్వాత చెల్లించే పద్ధతిని ప్రవేశపెట్టింది. దీనికి బుక్ న‌వ్‌, పే లేట‌ర్ అనే పేరు కూడా పెట్టింది. 

 

అయితే ఇందులో టికెట్లు బుక్ చేసుకునే వినియోగదారులు 14 రోజుల్లోపు డబ్బులు తిరిగి చెల్లించాలి. లేకపోతే 3.5 శాతం నుంచి వడ్డీ ప‌డుతుంది. మ‌రి ఇందులో టిక్కెట్లు ఎలా బుక్ చేయాలో ఓ లుక్కేసేయండి. ముందుగా ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ ఓపెన్ చేసి అందులోకి లాగిన్ అవ్వాలి. ఆ త‌ర్వాత‌ ప్లాన్ టు జర్నీలో మీరు ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు, ఏ తేదీన వెళ్తున్నారు వంటి వివరాలను అందించాలి. ఇప్పుడు టిక్కెట్ ఎంచుకునే ప్రక్రియ పూర్తయ్యాక ప్యాసెంజర్ వివరాలు అందించి చెల్లింపుల పేజీకి వెళ్లాలి.

 

అక్కడ మీకు ‘Pay-On Delivery/Pay Later’ ఆప్షన్ ను ఎంచుకుని ePay Later పోర్టల్ ద్వారా చెల్లింపును పూర్తి చేయాలి. ఇక త‌ర్వాత చెల్లింపును పూర్తి చేయడానికి మీ మొబైల్ నంబర్ ద్వారా ఓటీపీని అందించాలి. దీంతో చెల్లింపును పూర్తి చేస్తే రైలు టిక్కెట్ బుక్ అవుతుంది. అనంతరం మీరు జర్నీని అద్భుతంగా ఎంజాయ్ చేసేయండి. సో.. ఇకపై రైలు టిక్కెట్లు బుక్ చేసుకోవాలంటే బయట ఏజెంట్ల ద్వారా చేసుకుని ఇబ్బందులు పడకుండా మీ మొబైల్ ద్వారానే ఈ యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా చేసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: